అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఈ నెల 18న శాఖపరమైన విచారణ  నిర్వహించనున్నారు.

ఈ మేరకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సమాచారం పంపింది. చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఈ సమయంలో ఇజ్రాయిల్ నుండి పరికరాల కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడినట్టుగా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. 

ఇదే విషయమై ఆయనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు  కోర్టులను ఆశ్రయించారు. వెంకటేశ్వరరావుపై నమోదైన అభియోగాలపై  శాఖపరమైన విచారణను ఈ నెల 18న నిర్వహించనున్నారు. ఈ విషయమై మాజీ డీజీపీలను విచారణకు రావాలని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మెమోలు పంపింది.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో డీజీపీలుగా పనిచేసిన  జేవీ రాముడు, సాంబశివుడు, మాలకొండయ్య, ఆర్పీ ఠాకూరులను రావాలని మెమోలు జారీ చేసింది. ఏపీ సచివాలయంలో విచారణ జరగనుంది.