విచిత్రమేమిటంటే జయకు ఓ కూతురుందని అందరూ అనుకోవటమే గానీ ఇంత వరకూ ఎవ్వరూ చూడలేదు.
జయలలితకు సంబంధించిన వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేదు. మృతికి ముందు తర్వాత అనేక వివాదాలు కొనసాగుతుండగానే మరో కొత్త వివాదం మొదలైంది. అదే వారసత్వం. ఇన్ని సంవత్సరాలుగా జయలలితకు ఓ కూతురుందని ప్రచారంలో ఉంది. కానీ జయకు ఉన్నది కూతురు కాదని కొడుకని కొత్త ట్విస్ట్ మొదలైంది. అది కూడా తానేనంటూ కృష్ణమూర్తి అనే యువకుడు న్యాయస్ధానం మెట్లెక్కాడు. సాక్ష్యాలుగా కొన్ని డాక్యుమెంట్లను కూడా న్యాయస్ధానంలో సమర్పించటం పెద్ద సంచలనమైంది.
సినీనటుడు శోభన్ బాబు, జయలలితకు ఓ కూతురుందన్న ప్రచారం సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది. అయితే, శోభన్ బాబు, జయకు వివాహం అయిందని, కాకపోతే పుట్టింది కూతురు కాదని తానేనంటూ కృష్ణమూర్తి పలు డాక్యుమెంట్లను చూపుతున్నారు. వారి వివాహానానికి మరో మాజీ ముఖ్యమంత్రి ఎంజిఆరే సాక్షి అట. వివాహపత్రంపై జయ, శోభన్లతో పాటు సాక్షిగా ఎంజిఆర్ సంతకం చేసిన డాక్యుమెంట్లను చూపుతున్నాడు. అప్పటి కారణాల వల్ల జయ, శోభన్ దంపతులు తనను ఎంజిఆర్ కారు డ్రైవర్ కే దత్తత ఇచ్చారని చెబుతున్నారు. దానికి కూడా ఎంజిఆరే సాక్షి అట. ఆ పత్రాలను కూడా చూపుతున్నాడు.
శోభన్, జయలు తన చిన్నపుడు తరచూ తానున్న ఇంటికి వచ్చి పోతు ఉండేవారని కూడా చెబుతున్నాడు. అందుకు సాక్ష్యాలుగా ఫొటోలను, డాక్యుమెంట్లను, తనకు వారు రాసిన కొన్ని లేఖలను కూడా కృష్ణమూర్తి చూపుతున్నాడు. విచిత్రమేమిటంటే జయకు ఓ కూతురుందని అందరూ అనుకోవటమే గానీ ఇంత వరకూ ఎవ్వరూ చూడలేదు.
పనిలో పనిగా జయ మృతికి శశికళే కారణమంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు. జయ మరణం తర్వాత తనను శశికళ కుటుంబసభ్యులు కిడ్నాప్ చేసారని చెబుతున్నారు. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత తాను ఎలాగో తప్పిచుకుని న్యాయస్ధానాన్ని ఆశ్రయించానని కృష్ణమూర్తి చెప్పటం ఇపుడు తమిళనాడులో పెద్ద దుమారం రేపుతోంది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తారని చెప్పింది. ఆధారాలన్నింటినీ పోలీసులకు అందించాలని కూడా చెప్పింది. రాబోయే రోజుల్లో జయ వారసత్వం గొడవలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.
