ఛైర్ పర్సన్ ను మంత్రి అవమానించారని, ఇంకోసారి ఇదే విధంగా జరిగితే సహించేది లేదంటూ మంత్రినే హెచ్చరించారు. తనకు కర్నూలులో పనివుందని తాను వెళ్లిపోవాలంటూ మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు.
ప్రత్యక్ష రాజకీయాలతో మొన్నటి వరకూ ఏమీ సంబంధం లేదు. తల్లి చనిపోతే ఎంఎల్ఏ అయిపోయింది. తండ్రి పోగానే మంత్రీ అయిపోయింది. దాంతో ప్రోటోకాల్ తెలీదు. మంత్రైన తర్వాతైనా తెలుసుకోవాలి. అందులోనూ చుట్టూ ప్రత్యర్ధి వర్గాలున్నపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా భూమా అఖిలప్రియ గురించే. దుడుకుస్వభావం వల్ల నంద్యాల మున్సిపాలిటీ సమావేశంలో అవమానానికి గురయ్యారు. మంత్రి అయ్యుండీ టిడిపి సభ్యుల కారణంగానే సమావేశం మధ్యలోనే వెళ్ళిపోవాల్సి రావటాన్ని అవమానం అని కాక మరేమంటారు?
ఇంతకీ జరిగిందేమిటంటే, నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మొదటిసారిగా సమావేశానికి హాజరైన మంత్రి హాలులోకి రాగానే సమావేశాన్ని ప్రారంభించేసారు. నిజానికి సమావేశాన్ని ప్రారంభించాల్సింది ఛైర్ పర్సన్ సులోచన. సులోచన ఏమో శిల్పా వర్గంలోని నేత. మంత్రి వచ్చేటప్పటికి ఛైర్ పర్సన్ ఇంకా సమావేశ మందిరంలోకి రాలేదు. అయితే, ఈ విషయాన్ని పట్టించుకోకుండా మంత్రి సమావేశాన్ని ప్రారంభించేసారు
ఇంతలో సులోచన సమావేశ మందిరంలోకి వచ్చారు. అయితే, ఆ సమయంలో మంత్రి ప్రసంగిస్తున్నారు. రాగానే తాను రాకుండానే సమావేశాన్ని ఎలా మొదలుపెడతారంటూ మంత్రిని నిలదీసారు. అందుకు సమాధానం చెప్పకుండానే తాను మాట్లాడదలుచుకున్నది మాట్లాడేసి కూర్చున్నారు. దాంతో మంత్రి వైఖరిపై సులోచనతో పాటు శిల్పా వర్గంలోని కౌన్సిలర్లు మండిపడ్డారు. అక్కడే ఉన్న కో-ఆప్షన్ సభ్యుడు, సులోచన భర్త అయిన సుధాకర్ రెడ్డి మంత్రి వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి మాట్లాడుతున్నపుడే మైక్ ఇవ్వమని కోరినా మంత్రి ఇవ్వలేదు.
అంతేకాకుండా తాను మాట్లాడేసిన తర్వాత కూడా ఛైర్ పర్సన్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వార్డుల్లోని సమస్యలు చెప్పాలని అడిగటంతో గందరగోళం మొదలైంది. కౌన్సిలర్లు మాట్లాడటం కాదని ముందు తాను మాట్లాడుతానని సులోచన మైక్ అందుకోగానే వెంటనే మంత్రి లేచారు. దాంతో సుధాకర్ రెడ్డి అడ్డుకున్నారు. ఛైర్ పర్సన్ మాట్లాడేటపుడు ఎలా వెళతారంటూ నిలదీసారు. ఛైర్ పర్సన్ ను మంత్రి అవమానించారని, ఇంకోసారి ఇదే విధంగా జరిగితే సహించేది లేదంటూ మంత్రినే హెచ్చరించారు. ఇంకోసారి ఛైర్ పర్సన్ లేకుండా కౌన్సిల్ సమావేశం ప్రారంభిస్తే సహించేది లేదని కూడా అన్నారు. దాంతో మంత్రి తనకు కర్నూలులో పనివుందని తాను వెళ్లిపోవాలంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.
