ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం కానుంది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజధాని తరలింపు సహా పలు కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీతో పాటు మండలి సమావేశాలు జరుగుతాయని శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 18న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 

ఇప్పటికే జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ల నివేదికలు ప్రభుత్వం వద్దకు చేరగా వీటి అద్యయనం కోసం మంత్రులతో ఏర్పాటుచేసిన  హైపవర్ కమిటీ  నివేదిక అందించాల్సి వుంది. హైపవర్ కమిటీ నివేదిక తర్వాతే ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై  ప్రభుత్వం తుది నివేదిక తీసుకోనుంది. 

Also Read:ఏపి రాజధానిపై గందరగోళం... హైపవర్ కమిటీ ఆలోచన ఇదే

అయితే ఈ హై పవర్ కమిటీ నివేదిక ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వం వర్గాల నుండి సమాచారం అందుతోంది. త్వరలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమై పూర్తి నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం తీసుకోనున్న తెలుస్తోంది.

రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించిన కీలక నిర్ణయం కాబట్టి హడావుడిగా కాకుండా సమగ్ర నివేదికను జాగ్రత్తగా రూపొందించాలన్నది మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ ఆలోచనగా తెలుస్తోంది.

Also Read:అమరావతిలో మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ: ఎమ్మెల్యే అరెస్ట్

సోమవారం నాడు రాజధాని కోసం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిపై చర్చించారు. ఈ నెల 17వ తేదీలోపుగా రాజధాని రైతులు తమ సమస్యలను నేరుగా సీఆర్‌డీఏకు చెప్పాలని  హైపవర్ కమిటీ సూచించింది.

రాజధాని రైతులు తమ  సమస్యలను, సలహాలను, సూచలను సీఆర్‌డీఏ దృష్టికి తీసుకురావాలని  హైపవర్ కమిటీ కోరింది.  ఈ నెల 17వ తేదీ సాయంత్రం మరోసారి హైపవర్ కమిటీ సమావేశం కానుంది. రైతుల సమస్యలు, సూచనలపై హైపవర్ కమిటీ చర్చించనుంది.