వైఎస్ వివేకా హత్య: సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరౌతారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారంనాడు ఉదయం 11 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అదికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.
తనను న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పిటిషన్ లో కోరారు. అంతేకాదు తన విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఆ పిటిషన్ లో కోరారు. శుక్రవారం నాడు ఉదయం తెలంగాణ హైకోర్టులో ఉదయం పదిన్నర గంటలకు ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున సీబీఐ విచారణకు వెళ్తారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయమై న్యాయ నిపుణులతో వైఎస్ అవినాష్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందున సీబీఐ విచారణకు హాజరు కావాలా, హజారు కావద్దా అనే విషయమై ఆయన న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని సమాచారం.హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని వైఎస్ అవినాష్ రెడ్డికి పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే రెండు దఫాలు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ నెల 6వ తేదీనే విచారణఖు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ముందుగా నిర్ధేషించుకున్న షెడ్యూల్ కారణంగా సీబీఐ విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ఈ నెల 10వ తేదీన విచారణకు వస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లోపుగా తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీబీఐ విచారణకు హాజరుపై సందిగ్ధత నెలకొంది.
also read:వివేకా కేసులో ట్విస్ట్ .. సీబీఐ విచారణను వీడియో తీయాలి, తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్
2019 మార్చి 19వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందులలోని నివాసంలోనే దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1 గా ఎర్ర గంగిరెడ్డి ఉన్నారు. ఈ కేసులో వైఎస్ వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి అఫ్రూవర్ గా మారాడు.