విజయవాడ: సినీ హీరో శివాజీ ప్రత్యేక హోదా సాధన సమితిలో సభ్యుడే కాదని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. హోదా సాధనకు మద్దతిచ్చిన వారిలో శివాజీ ఒకడని తెలిపారు. ఆయా సమయాల్లో ఆయన సలహాలు మాత్రమే తీసుకున్నామని చెప్పారు. 

సాధన సమితి నుంచి శివాజీ వెళ్లిపోయారని చలసాని శ్రీనివాస్ చెప్పారు. కేంద్రంలో ఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా షరతులతో కూడిన మద్దతు మాత్రమే ఇవ్వాలని ఆయన సూచించారు. గతంలో మాదిరి కాకుండా కేంద్రంపై కచ్చితమైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. 

ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ప్రభుత్వం విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. విభజన హామీల అంశంలో మొదటి నుంచి అఖిలపక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈసారి గతంలో కన్నా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.