చంద్రబాబు అరెస్ట్.. బెజవాడలో కార్ల ర్యాలీకి ఐటీ ఉద్యోగులు రెడీ, అనుమతి లేదన్న సీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ విజయవాడలో ఈ నెల 24న కార్ల ర్యాలీ చేపట్టాలని ఐటీ ఉద్యోగులు నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతించబోమని విజయవాడ సీపీ కాంతిరాణా టాటా స్పష్టం చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీతో పాటు పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరులలో ఐటీ ఉద్యోగులు సైతం రోడ్డెక్కారు. ఈ క్రమంలో విజయవాడలో ఈ నెల 24న కార్ల ర్యాలీ చేపట్టాలని ఐటీ ఉద్యోగులు నిర్ణయించారు. దీనిపై విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా స్పందించారు.
ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా సామాజిక మాధ్యమాల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. వారు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రికి వెళ్తారని తెలిసిందని సీపీ వెల్లడించారు. అయితే బెజవాడలో కార్ల ర్యాలీకి అనుమతి లేని కమీషనర్ స్పష్టం చేశారు. కార్లతో సంఘీభావ యాత్రకు అనుమతించడం కుదరదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంతిరాణా టాటా హెచ్చరించారు. ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ALso Read: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : ముగిసిన చంద్రబాబు తొలి రోజు సీఐడీ విచారణ
ఇకపోతే.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో విచారణ పూర్తి చేశారు అధికారులు. మరోవైపు సెంట్రల్ జైలు దగ్గర పోలీసులు అలర్ట్ అయ్యారు. విచారణ అనంతరం సెంట్రల్ జైలు నుంచి గెస్ట్‌హౌస్‌కు వెళ్లనుంది సీఐడీ బృందం. చంద్రబాబు ఇచ్చిన సమాధానాలను వీడియో రికార్డింగ్ చేశారు అధికారులు. సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును విచారించారు సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు.
కోర్ట్ ఆదేశాల మేరకు విచారణ అంశాలు బయటకు రాకుండా జైలు అధికారులు భద్రతను ఏర్పాటు చేశారు.లంచ్ బ్రేక్‌కి ముందు ఫస్ట్ సెషన్‌లో రెండున్నర గంటల పాటు చంద్రబాబును ప్రశ్నించారు సీఐడీ అధికారులు. చంద్రబాబును రెండ్రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్ట్. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు కస్టడీ కొనసాగుతుంది. కస్టడీలోకి తీసుకునే ముందు ఆ తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ ప్రకారమే ఇవాళ విచారణకు ముందు వైద్య పరీక్షలు చేశారు. విచారణ సమయంలో ప్రతి గంటకు ఐదు నిమిషాలు బ్రేక్ ఇస్తున్నారు సీఐడీ అధికారులు.