పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను  తుంగలో తొక్కి సుప్రీంకోర్టులో  మాత్రం  హమీలకు విరుద్దంగా కేంద్రం  అఫిడవిట్లు సమర్పించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు


అమరావతి:పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి సుప్రీంకోర్టులో మాత్రం హమీలకు విరుద్దంగా కేంద్రం అఫిడవిట్లు సమర్పించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరును పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఆయన ఎంపీలకు సూచించారు.

సోమవారం నాడు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్పరెన్స్‌లో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.

కాపు రిజర్వేషన్లపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన ప్రకటన నేపథ్యంలో రాజకీయంగా జగన్ ను ఇబ్బందిపెట్టే ఉద్దేశ్యంతో కాపుల రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలనే డిమాండ్‌తో ఆందోళన చేయాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు. 

ఏపీకి కేంద్రం ఇచ్చిన హమీలను అన్ని అమలు చేస్తున్నామని పార్లమెంట్ వేదికగా హమీలు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కానీ, ఈ హమీకి విరుద్దంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసిన విషాయాన్ని ప్రస్తావించారు. తాజాగా విశాఖ రైల్వేజోన్ విషయమై బీజేపీ నేతలు చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు.

కాపు రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌ వేదికగా పట్టుబట్టాలని చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు. కాపుల రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలో లేదని, కేంద్రం పరిధిలో ఉందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన ప్రకటన నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కాపుల రిజర్వేషన్ పై పట్టబట్టాలని బాబు సూచించారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హమీల అమలు విషయాన్ని కూడ ప్రస్తావించాలని ఆయన ఎంపీలను కోరారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆయన ఎంపీలను ఆదేశించారు. 

కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటనే విషయం అఫిడవిట్లతో తేటతెల్లమైందనే విషయం తేలిందన్నారు. ఈ తరుణంలో పార్లమెంట్ సాక్షిగా బీజేపీ బండారాన్ని బట్టబయలు చేయాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు.

కాపుల రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు. కాపుల రిజర్వేషన్ల విషయమై జగన్ బండారాన్ని బట్టబయలు చేయాలని ఆయన సూచించారు. బీజేపీతో జగన్ కుమ్మకైన విషయాన్ని బయటపెట్టాలన్నారు.రాష్ట్ర ప్రయోజనాల విషయమై రాజీపడకూడదని కోరారు. ఒంగోలు ధర్మపోరాట దీక్ష విజయవంతమైందని బాబు చెప్పారు.

ఈ వార్తలు చదవండి.

1.కాపు రిజర్వేషన్: మీకు మేం ఎందుకు ఓట్లెయ్యాలి:జగన్‌‌కు ముద్రగడ కౌంటర్

2.వ్యాఖ్యల ఎఫెక్ట్: ప్రజా సంకల్పయాత్రకు కాపుల సెగ, జగన్‌ను అడ్డుకొనే యత్నం