అమరావతి:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కుదరదని ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.  కరోనా కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు.  రాష్ట్రంలో కరోనా ఇంకా నియంత్రణలోకి రాలేదని ఆయన చెప్పారు.

also read:రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ: లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరించిన ఏపీ హైకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై ప్రభుత్వంతో ఎన్నికల సంఘం చర్చించాలన్నారు. కానీ ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తగవన్నారు. 

చంద్రబాబునాయుడు చెప్పినట్టుగా రాష్ట్రంలో నడవదన్నారు. బాబు చెప్పినట్టుగా ఎన్నికల కమిషన్ నడుస్తోందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఈసీ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది.ఈ సమావేశానికి వైసీపీ సహా మరో ఏడు రాజకీయపార్టీలు గైర్హాజరయ్యాయి.

పది రాజకీయ పార్టీలు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలిపాయి. ఈ సమావేశం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో చర్చించారు. 

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం అఫిడవిట్ ను దాఖలు చేయనుంది.