విజయవాడ: రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ మొదటి శత్రువు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపిని రాష్ట్రానికి రెండో శత్రువుగా, కాంగ్రెసును మూడో శత్రువుగా చూస్తున్నట్లు తెలిపారు. 

తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ఆయన సోమవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చెప్పినా, తాము పలు మార్లు చెప్పినా టీడీపి తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. 

ఆవిర్భావం నుంచి కూడా టీడీపి పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తోందని అన్నారు. టీడీపిని చంద్రబాబు సర్వనాశనం చేసారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాటమంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

ఇదిలావుంటే, తుంగభద్ర డ్యాంలో ఉన్న నికర జలాలను చిత్రావతి జలాశయానికి తరలించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. 

తుంగభద్ర డ్యాం నుంచి నికర జలాలను తరలిస్తే పులివెందుల బ్రాంచ్ కెనాల్, లింగాల కుడి కాల్వలకు నీరు ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు కృష్ణానది వరద నీటిని నమ్ముకుని తుంగభద్ర నికర లాల హక్కును కాలరాస్తున్నారని అన్నారు.

తుంగభద్ర నుంచే పులివెందుల, ధర్మవరం వంటి పట్టణాలకు 2 టీఎంసీల మంచినీరు ఇవ్వాలని ఆయన అన్నారు. అవి పోతే సాగు నీటికి ఏమీ మిగలదని అన్నారు. తుంగభద్ర నికర జలాల హక్కులను ఎలా వదులుకోమంటారని ప్రశ్నించారు. తమ నికర జలాల హక్కును కొల్లగొట్టే ప్రయత్నాన్ని కచ్చితంగా వ్యతిరేకిస్తామని అన్నారు.