కాపు రిజర్వేషన్లకై పోరాడుతున్న ఉద్యమకారులను చినరాజప్ప కెలుకుతున్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేసారు.అసలు ఉద్యమం జరుగుతున్నదే రాజకీయ రిజర్వేషన్ల కోసమైతే అధికార పార్టీ పెద్దమనిషి ఇలా మాట్లాడటం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.అయితే  విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో మాత్రం రిజర్వేషన్లను కాపు నేతగా తానూ కోరుకుంటున్నానని  ఆయన తెలిపారు. ముద్రగడకు కావాల్సింది రాజకీయ రిజర్వేషన్లేనని,కాపుల సామాజిక అంశాలు అతడికి పట్టవని రాజప్ప విమర్శించారు.
బీసీ సామాజిక వర్గాల్లోకి కాపులను చేర్చే అంశంపై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌  నివేదిక కోసం తాము ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. నివేదికలోని న్యాయ పరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని,ఎలాంటి చిక్కులు రాకుండా ఉండడానికే వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నట్లు స్పష్టం చేశారు.   
ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్రకు అనుమతించే ప్రసక్తేలేదని హోం మంత్రి  స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు అన్ని అనుమతులు తీసుకుని శాంతియుతంగా చేపట్టారని గుర్తు చేశారు.అయితే అదికార పార్టీ నేతలందరూ చంద్రబాబు అనుమతి గురించి మాట్లాడుతున్నారు గాని,ఎవరూ ఆ అనుమతి పత్రాలను బయటపెట్టడం లేదు.
  గతంలో ముద్రగడ తునిలో చేపట్టిన కార్యక్రమంలో విధ్వంసం చెలరేగింది కాబట్టే  ముందు జాగ్రత్తలో భాగంగానే  పోలీసులను మోహరించామని రాజప్ప తెలిపారు.  కాని తుని ఘటనలో పోలీసుల వైపల్యాన్ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు.