విశాఖపట్టణం: భారతదేశానికి చెందిన రహస్యాలను పాకిస్తాన్ కు ఇద్దరు అన్నదమ్ములు చేరవేశారు. ఎన్ఐఏ ఈ ఇద్దరిని అరెస్ట్ చేసింది.ఈ నిందితులను ఎన్ఐఏ విచారిస్తోంది.విశాఖపట్టణంలో నౌక దళానికి చెందిన కీలక రహస్యాలను  పాకిస్తాన్ కు చేరువేస్తున్నాడనే అభియోగంతో  గతంలోనే ఎన్ఐఏ ఇమ్రాన్ గిటేలీని అరెస్ట్ చేసింది. నేవీ ఉద్యోగులకు హానీ ట్రాప్ వల వేసి రహస్యాలను  తెలుసుకొన్నారని  ఇమ్రాన్ పై  ఎన్ఐఏ ఆరోపణలు చేస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో గూఢచర్యం కింద  అసన్ గిటేలీని ఎన్ఐఏ తాజాగా అరెస్ట్ చేసింది. ఇమ్రాన్, అసన్ లు అన్నదమ్ములు. ఇండియాలో పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఏజంట్లుగా వ్యవహరిస్తున్నారు.బట్టల వ్యాపారం పేరుతో తరుచూ వీరిద్దరూ పాకిస్తాన్ కు వెళ్లేవారు. పాకిస్తాన్ లోని ఐఎస్ఐతో వారికి సంబంధాలు ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఇద్దరిని ఎవరు నడిపించారనే విషయమై  ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.

విశాఖలో నేవీ కేంద్రం ఉంది.  దీంతో విశాఖలో ఇమ్రాన్ స్థావరం ఏర్పాటు చేసుకొన్నాడు.   తొలుత లేడీస్ టైలర్ గా ఆయన అవతారమెత్తాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ గా పనిచేశాడు. అసఫ్ అనే వ్యక్తి నుండి వచ్చే ఆదేశాల్ని పాటిస్తూ విశాఖపట్టణం, కార్వర్, ముంబైలోని నౌకాదళ కేంద్రాల్లో ఉద్యోగుల్ని ప్రలోభాలకు గురిచేసేవాడని ఎన్ఐఏ గుర్తించింది.

నేవీ ఉద్యోగుల నుడి  దేశంలోని కీలక సంస్థలు, రక్షణ స్థావరాలు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, వ్యూహాత్మక ప్రదేశాలు, ఇతర రక్షణ సమాచారానికి సంబంధించిన వివరాలు, చిత్రాలు, వీడియోలు సేకరించి పాకిస్తాన్ కు చేరవేసేవాడు. ఈ సమాచారం ఇచ్చిన ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో డబ్ములు జమ చేసేవాడు. ఈ రకంగా సుమారు రూ. 65 లక్షలను జమ చేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.

 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాకు చెందిన  సౌరబ్ శర్మ ఆర్మీలో పనిచేసి కొంత కాలం తర్వాత అనారోగ్య కారణాలతో బయటకు వచ్చాడు. ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని ఆయన అనన్ అనే వ్యక్తికి అందించేవాడు. ఇందుకు ప్రతిఫలంగా శర్మ భార్య ఖాతాలో అనన్ భారీగా డబ్బులు జమ చేశాడు.ఈ విషయాన్ని గుర్తించిన ఎన్ఐఏ అనన్ ను అరెస్ట్ చేసింది.

గుజరాత్ రాష్ట్రంలోని పంచమహాల్ జిల్లా గోద్రా ప్రాంతానికి చెందినవారు ఈ గిటేలీ సోదరులు. వీరిద్దరూ నెలల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఐఎస్ఐ  ఏజంట్లకు ఇండియాకు చెందిన రహస్యాలను చేరవేస్తూ  ఎన్ఐఏకి చిక్కారు. వీరిద్దరికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయనే విషయమై  ఎన్ఐఏ ఆరా తీస్తోంది.