Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్ర ప్రదేశ్ లో ఇకపై ఆ ఛానల్స్ కూడా ప్రసారం ... న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి కూటమి గెలవగానే సాక్షి,టివి9, ఎన్టివి ప్రసారాలు నిలిచిపోయాయి. ఇలా రాష్ట్రంలో టివి ఛానల్స్ ప్రసారాల నిలిపివేతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు డిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఈ ఛానల్స్ పునరుద్దరించబడ్డాయి. 

News broadcaster Federation reacts blackout of channels in Andhra Pradesh AKP
Author
First Published Jun 25, 2024, 8:57 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రాగానే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత ఐదేళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తులపైనే కాదు వ్యవస్థలపైనా ఆంక్షలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే వైసిపి టివి ఛానల్ సాక్షితో పాటు టివి9, ఎన్టివి ప్రసారాలు ఏపీలో నిలిచిపోయాయి. అయితే తాజాగా డిల్లీ హైకోర్ట్ ఆదేశాలతో ఈ ఛానళ్ల ప్రసారాలు ఏపీలో పునరుద్దరించబడ్డాయి. మీడియా స్వేచ్చను కాపాడేలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది. ఏపీలో నిలిపివేసిన టివి ఛానల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ (ఎంఎస్‌వో) ను ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేసారు.  

డిల్లీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ న్యూస్  బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఏపీలో వార్తా ఛానల్స్ ప్రసారాలను ఏకపక్షంగా, చట్ట విరుద్దంగా నిలిపివేయడాన్ని న్యాయస్థానం ఖండించిందన్నారు. ఇలా ప్రజాస్వామ్యం కల్పించిన భావ ప్రకటన స్వేచ్చ, వాక్ స్వాతంత్య్రాన్ని న్యాయవ్యవస్థ కాపాడిందని  న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ పేర్కొంది.  

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా టిడిపి కూటమికి మెజారిటీ సీట్లు దక్కాయి. దీంతో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి... ఈ క్రమంలోనే వైసిపికి అనురకూలంగా వ్యవహరించారంటూ తెలుగు టివి ఛానల్స్ సాక్షి, ఎన్టివి, టివి9 ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లు నిలిపివేసారు. అయితే దీని వెనక టిడిపి పెద్దల హస్తం వుందనేది ప్రతిపక్ష వైసిపి ఆరోపణ. ఏదేమైనా టివి ఛానల్స్ ప్రసారాల నిలిపివేతపై తీవ్ర విమర్శలు వచ్చాయి.   

రాజకీయ ప్రయోజనాల కోసం పత్రికా స్వేచ్చను హరించేలా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను  తప్పుబడుతున్నారు. ఇలా ఏపీలో టిడిపి అధికారంలోకి రాగానే పలు టివి ఛానల్స్ నిలిపివేయడం ముమ్మాటికీ తప్పేనని... కేబుల్ ఆపరేటర్లు రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతిపెద్ద మార్కెట్ కలిగిన ఏపీలో ఇలా ప్రసారాలను నిలిపివేయడంతో ఆయా టివి ఛానల్స్ కి తీవ్ర నష్టం వాటిల్లింది.  ఏపీలో దాదాపు 65 లక్షలమంది సెట్ టాప్ బాక్సుల ద్వారా వార్తా చానళ్లను వీక్షిస్తారని అంచనా... వీరందరినీ కొన్ని ఛానల్స్ ను చూడకుండా నిలువరించడం ముమ్మాటికీ తప్పే అని న్యూస్  బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ అంటోంది.  

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఛానెల్స్‌ను డిస్‌కనెక్ట్ చేయడం చట్టవిరుద్దం. ఇది పంపిణీ సంస్థలతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో టీవీ9 పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్తానం టివి ఛానల్స్ వాదనతో ఏకీభవించింది.  ప్రజలకు తమకు ఇష్టమైన ఛానల్స్ ను వీక్షించే హక్కు వుంటుందని... అనధికారికంగా ఇలా ఛానల్స్ నిలిపివేయడం తగదని పేర్కొంది. వెంటనే ఏపీలో నిలిపివేసిన వార్తా ఛానల్స్ ను పునరుద్దరించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

 న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ఈ నిర్ణయానికి మద్దతునిస్తూ కోర్టు ఆదేశాలను తక్షణమే పాటించాలని సంబంధిత అధికారులందరికీ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను , జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడానికి ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని నమ్ముతున్నామని తెలిపింది. రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ పత్రికా స్వేచ్చను కాపాడేలా తీర్పునిచ్చిన డిల్లీ కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. 

న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ జర్నలిస్టుల హక్కులు, సమాచార స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు అవసరమైన న్యాయ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి బ్లాక్ ఔట్‌లను  నివారించడానికి , మీడియా ఛానెల్‌లు అనవసరమైన జోక్యం లేకుండా పనిచేసేలా చూసుకోవడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, నియంత్రణ సంస్థలను కోరుతున్నామని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios