చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు అదృశ్యం అయింది. తల్లి పక్కనే నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. శిశువు ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు అదృశ్యం అయింది. తల్లి పక్కనే నిద్రిస్తున్న శిశువును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు.. రహమత్, షబానా దంపతులకు నిన్న మగ శిశువు జన్మించాడు. అయితే శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి పసికందు అదృశ్యం కావడంపై జేసీ శ్రీధర్ స్పందించారు. పసికందు మాయంపై వేగంగా విచారణ చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్న చిత్తూరు టుటౌన్ పోలీసులు 

ఇక, ఇటీవల విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో కూడా పసికందు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లాలోని రౌతుపాలేనికి చెందిన అప్పాయమ్మ ఈనెల 13న కేజీహెచ్‌లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. బుధవారం రాత్రి ప్రసూతి వార్డుకు ఇద్దరు మహిళలు పాపను పరీక్షించాలని చెప్పి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పాయమ్మకు తన బంధవులను పంపిస్తానని చెప్పగా, వారి అవసరం లేదని చెప్పి పాపను బలవంతంగా తీసుకువెళ్లారు. అయితే ఎంతసేపటికి వారు పాపను తిరిగి తీసుకురావడంతో అపాయమ్మ ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బందికి తెలియజేసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చివరకు నిందితులు కారులో శ్రీకాకుళం వైపు వెళ్లినట్టు గుర్తించారు. కోటబొమ్మాళి మండలం జర్జంగి దగ్గర కారులో తరలిస్తున్న పసిపాపను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పసికందును స్వాధీనం చేసుకుని శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి విశాఖపట్నంకు తరలించారు.