ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ అక్రమాల కేసులో కొత్త ట్విస్ట్.. ప్లాన్ బెడిసికొట్టింది..
అనంతపురంలో కలకలం రేపిన ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమాల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు దారులతో పాటు ఓ పోలీసు అధికారి కూడా కలిశాడని తేలింది.
అనంతపురం : ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ అక్రమాల కేసు సరికొత్త మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో ఫిర్యాదుదారులు కూడా సహ నిందితులే అని తేలింది. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో డబ్బు రాబట్టుకునేందుకు ‘ఫిర్యాదు’ డ్రామాకు తెరలేపారని నిర్ధారించారు. ‘ఫిర్యాదు’ ప్లాన్ కు రూపకల్పన చేసిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నట్లు తెలిసింది. టిడిపి నేతల అండదండలు కలిగిన అనంతపురానికి చెందిన రాయల్ శ్రీనివాసులు, దండు వెంకటనాయుడు అలియాస్ డివి నాయుడు ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్ తో జత కట్టారు. అతని సహకారంతో నకిలీ ఎన్ఓసిలు సృష్టించడం, డాక్యుమెంట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేయించడం తదితర అక్రమ మార్గాల ద్వారా అనతికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తారు.
ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు : కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వేనెంబర్ లో 513లోని భూమికి సంబంధించిన ఎన్వోసీ కోసం రూ.కోట్లు చేతులు మారాయి. చెప్పిన విధంగా ఎన్వోసీ చేయించకపోవడంతో భూమి యజమాని తాను ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. మనోజ్ మాత్రం గడువుమీద గడువు కోరుతూ వచ్చాడు. ఇరువైపులా కమీషన్ తీసుకున్న రాయల్ శ్రీనివాసులుకు ఇది ఇబ్బందికరంగా మారింది. మనోజ్ ను ఇరకాటంలో పెట్టి అయినా సరే డబ్బు రాబట్టాలని డీవీ నాయుడుతో కలిసి ప్లాన్ చేశారు.
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు లో తొక్కిసలాట, ఇద్దరు విద్యార్ధుల అస్వస్థత: విజయనగరంలో చికిత్స
రంగంలోకి ‘పెద్దమనిషి’ : అనుకున్నదే తడవుగా పోలీసు శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ పెద్ద మనిషిని రాయల్ శ్రీనివాసులు, డీవీ నాయుడు ఆశ్రయించారు. ఎలాగైనా మనోజ్ పై ఒత్తిడి పెంచి డబ్బు రాబట్టాలని, మీరు కూడా కావలిసినంత దండుకోవచ్చు అని సలహా ఇచ్చారు. మనోజ్ ను భయపెట్టడానికి అవసరమైతే అతని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తామని చెప్పారు. దీనికి ‘పెద్దమనిషి’ సరేనన్నాడు. ఈ పని చేసి పెట్టడానికి ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను సంప్రదించి.. అనంతపురంలోని పోలీసు అతిథి గృహానికి పిలిపించాడు. మనోజ్ ను భయపెట్టి, మనకు కావలసినంత డబ్బు రాబట్టుకోవడానికి ఏదైనా మంచి ప్లాన్ ఇవ్వాలని శ్రీనివాసులు, డివి నాయుడు కోరారు.
ఎన్వోసీ విషయంలో మనోజ్ మోసం చేశాడని ‘‘పోలీసు స్పందన’లో ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. ఆ ఫిర్యాదు నేరుగా తన వద్దకే వస్తుందని, అప్పుడు మన పని సులభమవుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ పక్కా ప్లాన్ రచించారు. ఇందుకుగాను శ్రీనివాసులు, నాయుడులతో డీల్ కుదుర్చుకున్నారు. వీరికి అనుసంధాన కర్తగా ఉన్న పెద్దమనిషికి కూడా. రూ. లక్షల్లో ముట్ట చెప్పారు.
బెడిసికొట్టిన వ్యూహం : సీఐ ప్లాన్ మేరకు గత నెలలో రాయల్ శ్రీనివాసులు డి వి నాయుడు స్పందనలో ఎస్పి ని కలిసి ఫిర్యాదు చేశారు. మనోజ్ తమను మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరారు. అయితే, ఈ ఫిర్యాదును ఎస్పీ పకీరప్ప సీరియస్ గా తీసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ)ను రంగంలోకి దింపారు. మనోజ్ ను ఎస్ఓజీ తన ఆధీనంలో ఉంచుకుంది. తెలుగు తమ్ముళ్లలో ఒకరైన రాయల్ శ్రీనివాసులును సైతం విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. దీంతో మరొకరైన డీవీ నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఊహించని విధంగా వ్యూహం బెడిసి కొట్టడంతో సదరు సీఐ ఖంగుతిన్నారు. నిందితులను ఎస్పి నేరుగా విచారణ చేస్తే తమ బండారం బయటపడుతుందని భయపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నిత్యం నిందితుల వద్ద ఉంటున్నట్లు సమాచారం.