పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధ్ రెడ్డి ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ తాను టిడిపిలో చేరగానే తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసినట్లు స్సష్టంగా చెప్పారు. నిజంగానే నలుగురు వైసీపీ ఎంఎల్ఏలు రాజీనామాలు చేసుంటే వాటిని ఎందుకు ఆమోదించటం లేదని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు.

ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాలపై కొత్త నాటకం మొదలైంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికే ఫిరాయింపు ఎంఎల్ఏలు తమ పదవులకు రాజీనామాలు చేసారా? ఇపుడు అదే విషయమై పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. వైసీపీ ఎంఎల్ఏలను టిడిపి మంత్రివర్గంలో ఎలా ప్రమాణస్వీకారం చేయిస్తారంటూ ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షం భాజపా పెద్ద ఎత్తున చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తుతోంది. విమర్శల నుండి తప్పించుకునేందుకు, ఆరోపణల నుండి బయటపడటంతో పాటు తన చర్యను సమర్ధించుకోవటానికి చంద్రబాబు పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం. తెలంగాణాలో టిడిపి సభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు వేసిన ఎత్తునే ఏపిలో కూడా చంద్రబాబు మొదలుపెట్టారు.

తెలంగాణాలో సమస్య వచ్చినపుడు తాను రాజీనామా చేసినట్లు అప్పట్లో తలసాని చెప్పుకున్నారు. తాను టిడిపికి రాజీనామా చేసిన తర్వాతనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసానని తలసాని చెప్పుకున్నారు. తన రాజీనామాను ఆమోదించేది లేనిదీ స్పీకర్ పరిధిలో ఉందని కూడా అన్నారు. అదే దారిలో ఇపుడు చంద్రబాబు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఫిరాయింపు ఎంఎల్ఏలు కూడా వెళుతున్నారు. నలుగురు ఫిరాయింపు ఎంఎల్ఏలు రాజీనామాలు చేసిన తర్వాతనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినట్లు కొత్తగా ప్రచారం మొదలైంది.

మరి, అదే నిజమైతే ఆ రాజీనామా లేఖలు ఎవరి వద్ద ఉన్నయన్న విషయం పెద్ద సస్పెన్స్ గా మారింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించే వారి పేర్లతో నలుగురు ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాల లేఖలను కూడా జిఎడి అధికారులు ఫైల్లో పెట్టి పంపినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ముందుజాగ్రత్తగా వారి రాజీనామా లేఖలను గవర్నర్ కు పంపి ఆమోదం కూడా తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయ్. అయితే గవర్నర్ వద్దకు వెళ్ళిన రాజీనామా లేఖలు స్పీకర్ వద్ద ఉన్నాయా? చంద్రబాబు వద్ద ఉన్నాయా అన్నది మాత్రం తెలియటం లేదు.

ఇదే విషయమై వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏ, పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధ్ రెడ్డి ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ తాను టిడిపిలో చేరగానే తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసినట్లు స్సష్టంగా చెప్పారు. మిగిలిన ఎంఎల్ఏల గురించి తనకు తెలీదని కూడా అన్నారు. ఇదే విషయమై వైసీసీ ఎంపి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నిజంగానే నలుగురు వైసీపీ ఎంఎల్ఏలు రాజీనామాలు చేసుంటే వాటిని ఎందుకు ఆమోదించటం లేదని ప్రశ్నించారు. రాజీనామాలు చేసారనటాన్ని డ్రామాలుగా కొట్టి పడేసారు.