అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి వారి రథం అగ్నికి ఆహుతయిన దురదృష్టకర సంఘటన మనందరికీ విదితమే. రథం పూర్తిగా కాలిపోవడంతో...... నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 

వచ్చే స్వామి వారి కల్యాణోత్సవం కి నూతన రథం పై స్వామి వారి ఊరేగింపు జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించడం తో  నూతన రథం నిర్మాణం పనులను పూజ చేసి అధికారులు ప్రారంభించారు. 

దీనిలో భాగంగా రావులపాలెం వెంకట సాయి  టింబర్ డిపో లో ఉన్న కలపను గుర్తించి శాస్త్రోక్తంగా పూజ చేసి పనులను ప్రారంభించారు. 

నూతన రధం నిర్మాణానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 95 లక్షల రూపాయి లు కేటాయించి, నూతన రధం నమూనాకు ఆమోదం తెలపడం తో నిర్మాణ పనులు అధికారులు శరవేగంగా చేస్తున్నారు. 

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించిన అంతర్వేది రథం దగ్ధం ఘటనపై అసలు విషయాలను బయట పెట్టెందుకు ఏపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. 

ఈ మేరకు శుక్రవారంనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీ రాత్రి అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై హిందూ సంఘాలతో పాటు విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశాయి. 

రాష్ట్రంలోని పలు ఆలయాలపై దాడులు సాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శలు చేశాయి.అంతర్వేదిలో చోటు చేసుకొన్న ఘటనను నిరసిస్తూ వీహెచ్‌పీ, బీజేపీ, జనసేనలు తాజాగా ఛలో అంతర్వేదికి పిలుపునిచ్చాయి. 

బీజేపీ, జనసేలు సంయుక్తంగా ఈ నెల 10వ తేదీన దీక్షలు నిర్వహించాయి.ఈ ఘటనను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటించింది.