ఒక వైపు రాజధానిలో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం, స్మృతివనం మరొక వైపు రాజధానిప్రాంతంలోని పోలీసు స్టేషన్లన్నింటా దళిత రైతుల మీద కేసులు.ఈ ప్రాంతమంతా ఉద్యమాలు చేయకుండా నిషేధాజ్ఞలుఇళ్లలోనే నిరసన దీక్షలు జరపుతూ ఉండటం అమరావతి దుర్గతి
ఈ రోజు ఒక వైపు రాజధానిలో బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం, 96 కోట్లతో స్మృతివనం ఏర్పాటవుతూ ఉంటే, మరొక వైపు రాజధానిప్రాంతంలోని పోలీసు స్టేషన్లో కేసులు పెడుతున్నది దళిత రైతుల మీదే.
మంత్రులు, నేతలు అంబేద్కర్ జన్మస్థలం, న్యూఢిల్లీ పార్లమెంటు నుంచి మట్టి, నీరు తెచ్చి, అంబేద్కర్ కు చాలా పవిత్రంగా నివాళులర్పిస్తున్నట్లు ఏప్రిల్ 14 కార్యక్ర మం కోసం వారం రోజుల నుంచి ఎంత హంగామా చేస్తున్నారో. అయితే, అటు రాజధాని గ్రామాలలో అడుగడుగునా దళితులను వెలివేస్తున్నారు. తరిమేస్తున్నారు. నోరు మెదపనివ్వడం లేదు. సంవత్సరం పొడవునా సెక్షన్ 30, 144 పెట్టి దీక్షలకు, ఊరేగింపులకు అనుమతివ్వడం లేదు. దళితుల అసైన్డ్ భూములకు కౌలు ఇవ్వాలని కోరేందుకు దీక్షలకు అనుమతి లేక తుళ్లూరులో దళితులు, గిరిజనులు వారి ఇళ్లలోనే గృహదీక్షలు జరపాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే రాజధాని ప్రకటించిన తరువాత తుళ్లూరు పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో 90 శాతం పూర్తిగా దళిత యువతపైనే ఉన్నాయి.
ఆధునిక దళితవాడలు
దళిత ఉద్ధారకుడిగా చంద్రబాబునూతనావతరం ఎత్తుతున్నారు. 125 అడుగుల విగ్రహ ఏర్పాటుకు ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే, అంబేద్కర్ ని అవమాన పరుస్తూ ప్రపంచస్థాయి రాజధానిలో ఆధునిక దళితవాడలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
సీడ్ డెవలప్మెంట్(క్యాపిటల్) ఉన్న ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం గ్రామాల్లో భూములన్నీ పెద్దలకే కేటాయించింది. ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటనలు రాలేదనే పేరుతో ఆ ప్రాంతంలో అసైన్డ్ రైతులకు కేటాయింపులను నిలిపేసింది. ప్రభుత్వం నుండి అనుమతొచ్చిన తరువాత రాజధానిలో ఏ మూల ఖాళీ ఉంటే ఆ మూలన దళితులకు భూములు కేటాయిస్తారు. అంటే ఉద్దేశపూర్వకంగానే దళితులను రాజధాని నుండి దూరంగా పంపించే కుట్రకు పాల్పడ్డారు. శాఖమూరులో అగ్రకుల రైతుకు దళితుల ప్లాట్ల మధ్య ప్లాటు వచ్చిందనే ఉద్దేశంతో ఆ ప్లాను అక్కడ రద్దు చేయించి వారి సామాజిక తరగతికి ప్లాట్లున్న ప్రాంతంలో కేటాయించారు. ఒకసారి లాటరీ వేస్తే మారదని చెప్పిన పాలకులు ఇలా ఎందుకు మార్చారని దళితులు ప్రశ్నిస్తే వారిపైనా కేసులు బనాయించారు. దళితులకు కేటాయించే చిన్న ప్లాట్లు ఊరికి దూరంగా ఇవ్వడం వల్ల కొత్త దళితవాడలు ఉద్భవిస్తున్నాయి. ఇక రాజధానిలో వేస్తున్న రోడ్లన్నీ ఆయా గ్రామాల్లో ఎక్కువభాగం దళితుల నివాసాల మధ్యలో నుండే వెళుతున్నాయి. తాత్కాలిక సచివాలయం పక్కనే ఉన్న ఐనవోలులో రోడ్డు వేసే ప్రాంతంలో చర్చి ఉందని దాన్ని తొలగించేందుకు కుట్రపన్నారు. 53 వేల ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉన్పప్పటికీ కొత్తరోడ్లు దళితవాడల గుండా వెళ్లడం యాదృచ్ఛికం కాదు. రాజధానిలో ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కొత్త లేఅవుట్లలో వారికి స్థలం చూపలేదు. ఇళ్లులేని పేదలు అత్యధికమంది దళితులే. వారి ఇళ్లకు ఎక్కువ చోట్ల పట్టాలు లేవు. ఉన్న కొద్దిమందికి ప్రభుత్వ గృహనిర్మాణశాఖ వద్దే తనఖాలో వున్నాయి. ఉద్దండరాయు నిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయిపాలెం కీలకమైన సీడ్కాపిటల్లో వున్నాయి. వీటిలో 80 శాతం మంది దళితులే. ఈ గ్రామాల్లో 1,691 ఎకరాలను సీడ్ డెవలప్మెంట్ ఏరియాగా నామకరణం చేసి సింగపూర్ కాన్సార్టియంకు కట్టబెట్టడానికి కుట్రలు సాగుతున్నాయి.
ఉపాధి సదుపాయాలు మృగ్యమే
రాజధానిలో అత్యధిక మంది దళితులు వ్యవసాయ కూలీలే. భూముల సమీకరణతో పనులు కోల్పోయారు. జీవనం కష్టమైంది. కూలీలకు నెలకు కుటుంబానికి రూ.2500 పెన్షన్ ఇచ్చి సరిపెడుతున్నారు. నెలకు కనీసం రూ.తొమ్మిదివేలు ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచించినా పెడచెవిన పెట్టింది. కాగ్ నివేదిక పెన్షన్ తక్కువ మందికే ఇస్తున్నారని ఎత్తి చూపింది. వలసలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఉపాధి కోల్పోయి జీవనం దుర్భరమైన దళితుల గోడు పట్టించుకోవడం లేదు. గతంలో నదీతీరంలో ఇసుక పనుల్లో దళితులు బతికేవారు. నేడు డ్రెడ్జింగ్ మిషన్లు పెట్టి బడా కంపెనీలు తవ్వుకుంటూ దళితులు కడుపు కొడుతున్నాయి. రాజధాని ఉద్యోగాలన్నీ స్థానికులకేనని నమ్మ బలికారు. తాత్కాలిక సచివాలయంలో వాచ్మెన్ మొదలు కాంట్రాక్టు పనుల సైతం పేదలు, దళితులకు దక్కలేదు. ఉపాధిహామీ పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. చేసిన పనికి కూలీ సకాలంలో ఇవ్వడం లేదు.
200 అడుగుల విశాలమైన రోడ్లు, ఆకాశహర్మ్యాల డిజైన్లతో ఊదరగొడుతున్నారు. దళితవాడల్లో ఇప్పటికీ కనీస సదుపాయలు లేవు. అగ్రకుల వాడల్లో మంచినీరు వున్నా దళితవాడల్లో నీరు కరువే. మందడం గ్రామంలో దీనిపై దళితులు నిలదీస్తే గానీ వారికి మంచినీరు దక్కలేదు. శ్మశానాలు సంగతి సరేసరి. రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలో పేదలు, దళిత పిల్లలకు మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు అదృశ్యమయ్యాయి. ఉపాధి లేక, తిండిలేని తల్లిదండ్రులు తమ పిల్లలన్నా పాఠశాలల్లో తింటారులే అని మనసు సంభాళించుకునే సమయంలో పాఠశాలల్లో అందించే కొద్దిపాటి పోషకాహారానికి కోత పెట్టడం వారిని మరింత కుంగదీసింది.
రాజధాని నిర్మాణంలోనూ, నిర్వహణలోనూ కార్పొరేట్, పాలకపార్టీ పెద్దలే తప్ప పేదలు, దళితులకు భాగస్వామ్యం లేదు. రాజధాని కమిటీలో దళితుడైన స్థానిక తెలుగుదేశం శాసనసభ్యునికే తొలుత చోటు దక్కలేదు. నిలదీస్తేగానీ ఆహ్వానితుడిగా స్థానం కల్పించలేదు. రైతు కమిటీల్లోనూ అగ్రకుల రైతులదే పెత్తనం. రాజధాని శంకుస్థాపన మహౌత్సవం జరిగిన ఉద్దండరాయిని పాలెం గ్రామ దళితులకే ప్రవేశం లేకుండా పోయింది. అమరావతిలో పేదలు, దళితులకు బతికే హక్కు లేకుండా చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామనే పేరుతో వారి దృష్టి మళ్లిస్తున్నారు. దళితులపై వివక్షను కప్పిపుచ్చుతున్నారు. కనీసం విగ్రహ శంకుస్థాపన సందర్భంలోనైనా ముఖ్యమంత్రి దళితులకు సమాన ప్యాకేజీ ప్రకటించి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. లేనిపక్షంలో దళితులు, పేదలకు ఉద్యమాలే శరణ్యం.
*రచయిత రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్
(ప్రజాశక్తి దినపత్రిక నుంచి)
