ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార మదంతో వేధిస్తే జనం వాత పెడతారని.. విపక్షాలకు చెందిన నేతలను, కార్యకర్తలను వేధించొద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు.      

విప‌క్షాల‌కు చెందిన నేత‌లు, కార్య‌కర్త‌లను వేధించ‌వ‌ద్ద‌ని వైసీపీ శ్రేణుల‌కు (ysrcp) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి (kotamreddy sridhar reddy) సూచించారు. శ‌నివారం నెల్లూరులో నిర్వ‌హించిన నియోజ‌క‌వర్గ స్థాయి ప్లీన‌రీలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్షాల‌కు చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాల‌ని కోటంరెడ్డి వైసీపీ శ్రేణుల‌కు సూచించారు. అధికార మ‌దంతో ప్ర‌వ‌ర్తిస్తే జ‌నం వాత పెడ‌తార‌ని కూడా కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించే వారికి ఎక్క‌డ వాత పెట్టాలో జ‌నానికి తెలుస‌న్న కోటంరెడ్డి... ఆ వాత‌ల‌ను ఎప్పుడు పెట్టాలో కూడా జ‌నానికి బాగానే తెలుసునంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. 

ఇకపోతే.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్దిరోజుల క్రితం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నెల్లూరు రూరల్ మండలంలో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్న కోటంరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పిగా వుందని చెప్పడంతో వ్యక్తిగత సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కోలుకున్న ఆయన తన రాజకీయ కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటున్నారు.