Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ వేషం వేసిన టీడీపీ నేత: వ్యాపారుల నుంచి లక్షల దోపిడి

తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేత పోలీసు వేషంలో దోపిడిలకి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. 

nellore tdp leader robbery in police dress
Author
Kavali, First Published Apr 22, 2019, 10:44 AM IST

తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేత పోలీసు వేషంలో దోపిడిలకి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెం గ్రామానికి చెందిన మర్రి రవి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు.

ఇతను సెంట్రింగ్ సామాగ్రిని బాడుగకు ఇవ్వడంతో పాటు కూలీలతో సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేయిస్తూ ఉంటాడు. ఇతనికి భర్తకు దూరమైన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈమెకు చెన్నై నుంచి అక్రమ మార్గంలో బంగారం బిస్కెట్లు తీసుకొచ్చే ఓ వ్యాపారితో సంబంధాలున్నాయి.

కావలికి చెందిన కొందరు బంగారు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా, బిల్లులు లేకుండా చెన్నైలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి వాటిని కావలిలో విక్రయించేవారు. మర్రి రవితో సంబంధం ఏర్పడినప్పటి నుంచి అతని ఒత్తిడి మేరకు  బంగారం కొనేందుకు తీసుకెళ్లిన డబ్బు పోలీసులకు పట్టుబడిందంటూ వ్యాపారికి చెప్పి నమ్మించేది.

అలా మర్రి రవి దోపిడీకి ఓ బృందాన్ని తయారు చేశాడు. బంగారం కొనేందుకు ఎవరెవరు వెళుతున్నారు.. ఎప్పుడు వెళుతున్నారు. వారి ప్రయాణ వివరాలను సదరు మహిళ ద్వారా తెలుసుకుంటూ ఉండేవాడు. దానిని బట్టి రవి వారిని వెంబడించి.. పోలీసులమని భయపెట్టి నగదు ఎత్తుకెళ్లేవాడు.

ఇదే తరహాలో బంగారం కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి తన మనుషులకు రూ.56 లక్షలు ఇచ్చి పంపించాడు. ఎన్నికల కోడ్ కొనసాగుతున్నందున పోలీసులు, ఐటీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఇద్దరు మహిళలను కూడా వెంట పంపించాడు.

ఈ ముగ్గురు చెన్నై వెళ్లేందుకు కావలిలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. రైలు నెల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న తర్వాత పోలీసుల వేషంలో కొందరు ఆగంతకులు ఈ ముగ్గురినీ అడ్డగించారు. భయపెట్టి వారి వద్ద వున్న రూ.56 లక్షలను దోచుకెళ్లారు.

దీంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా.. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో భాగంగా ఒక మహిళ ఫోన్ నుంచి మర్రి రవి ఫోన్‌కు పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు.

అనంతరం రవిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నాయపాళెం గ్రామంలో రూ.22 లక్షలు, కావలిలో రూ.14 లక్షలు, మిగిలిన రూ.20 లక్షలు ఎక్కడ దాచారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios