పవన్‌పై జగన్ విమర్శలు: కాపులు కన్నెర్ర చేస్తే..?

negative impact of Ys jagan comments on pawan kalyan
Highlights

పవర్‌స్టార్‌ను తిట్టడం ద్వారా ఆయనంటే పడిచచ్చే అభిమానులతో పాటు కాపు సామాజికవర్గానికి ఆగ్రహం తెప్పించారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగన్ వ్యాఖ్యలపై కాపునాడు రంగంలోకి దిగింది

గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శల దాడిని పెంచారు వైసీపీ చీఫ్ జగన్. నాలుగేళ్లకొసారి.. ఐదేళ్లకొసారి కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడు ఓ పెద్ద మనిషి.. ఇలాంటి పని మరేవరైనా చేసి ఉంటే నిత్య పెళ్లికొడుకని చెప్పి జైల్లో వేసేవారు.. అతను కూడా రాజకీయాల గురించి మాట్లాడటం మొదలుపెడితే.. దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాల్సి రావడం ఖర్మ అంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ.. జగన్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. తానేమి తక్కువ తినలేదంటూ ఈ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు పవన్

జైలు జీవితం, అక్రమ సంపాదన గురించి ప్రస్తావిస్తూ విమర్శలు సంధించారు. ఫ్యాక్షనిస్టులకు భయపడేది లేదని తెగేసి చెప్పాడు.. సీఎంను ఎదుర్కొనే దమ్ములేక.. శక్తిలేక పారిపోతున్నారని.. నా జీవితం తెరిచిన పుస్తకమని.. నేను వ్యక్తిగతంగా వెళితే మీరు ఊపిరి పీల్చుకోలేరని జగన్‌కు ధీటుగానే బదులిచ్చారు జనసేనాని. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 

ఇలాంటి పరిస్థితుల్లో విశ్లేషకులు ఒక కొత్త వాదన తెరమీదకు తెస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ మద్ధతు కారణంగానే టీడీపీ గెలిచిందని.. పవన్ సామాజికవర్గం మొత్తం గుంపగుత్తగా ఓట్లన్ని తెలుగుదేశానికే వేసిందని వైసీపీ అధినేత గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని గట్టి నిర్ణయానికి వచ్చిన జగన్ కాపు నాయకులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఆ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో కాపులకు దగ్గరవుతూ వచ్చారు ప్రతిపక్షనేత. 

ఈలోగా.. టీడీపీకి పవన్ కల్యాణ్ మద్ధతు ఉపసంహరించుకోవడం.. తమను బీసీల్లో కలుపుతామన్న హామీని ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో కాపుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ పావులు కదిపారు. కాపులు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా భావించే దివంగత వంగవీటి మోహనరంగాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కీలకనేత గౌతంరెడ్డిని పార్టీలోంచి సస్పెండ్ చేసి ఆ వర్గాన్ని మచ్చిక చేసుకున్నారు.

తన ప్రజా సంకల్పయాత్రలో కాపులు బలంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆయన పాదయాత్ర మిగిలిన జిల్లాల్లో కంటే ఎక్కువగా గోదావరి జిల్లాల్లో జరిగింది. దీనికి గోదావరి వాసులు బ్రహ్మరథం పట్టారు. అలా అంతా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న తరుణంలో జగన్ కోరి పెద్ద తప్పు చేశాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్‌ వ్యక్తిగత విషయాల్ని తెరమీదకు తీసుకువ్చి.. జగన్ పెద్ద తప్పు చేశారంటున్నారు. 

పవర్‌స్టార్‌ను తిట్టడం ద్వారా ఆయనంటే పడిచచ్చే అభిమానులతో పాటు కాపు సామాజికవర్గానికి ఆగ్రహం తెప్పించారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగన్ వ్యాఖ్యలపై కాపునాడు రంగంలోకి దిగింది.. పవన్ కల్యాణ్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి సహించలేకే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారని.. బేషరుతుగా క్షమాపణలు చెప్పని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది కూడా. 

ఈ మాటల యుద్ధానికి ఇప్పట్లో తెరపడే అవకాశం కనిపించడం లేదు.. కచ్చితంగా పవన్ మూడు పెళ్లిళ్ల అంశం ఎన్నికల సమయంలో ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇన్నాళ్లు ఎంతో కష్టపడి సంపాదించిన మంచిని రెండు నిమిషాల్లో జగన్ పొగొట్టుకున్నాడని వైసీపీ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. భారీగా ఉన్న కాపు ఓట్లు ఎన్నికల్లో పార్టీల తలరాతను మారుస్తాయనడంలో సందేహం లేదు. ఇది ఎన్నో  సందర్భాల్లో రుజువైంది కూడా.. మరి ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూడాలి.
 

loader