అమరావతి: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఫెడరల్ ఫ్రంట్ కు హ్యాండ్ ఇచ్చారా...?కేసీఆర్ కూడగడుతున్న కూటమికి నో చెప్తున్నారా...?చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న యూపీఏ కూటమికి జై కొట్టనున్నారా...?నవీన్ పట్నాయక్ ను కేసీఆర్ కలిసిన మరుసటి రోజే ఒడిషా ఎంపీ చంద్రబాబుతో భేటీ వెనుక మర్మం ఏంటి ...?నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా సౌమ్యా రంజన్ పట్నాయక్ చంద్రబాబు తో భేటీ అయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత ఓ సారి చూద్దాం. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దూకుడు పెంచుతున్నారు. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన గులాబీ బాస్ ఇక హస్తిన వేదికగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. ఒకవైపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కేసీఆర్ బిజీబిజీ ఉంటే మరోవైపు ఆయన కలిసిన వారిలో కొందరు ఝలక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీని కేసీఆర్ కలిశారు. తాజా రాజకీయాలపై చర్చించారు. రాష్ట్రాల హక్కుల సాధన కోసం ఫెడరల్ ఫ్రంట్ వేదికగా పోరాటం చేద్దామని కోరారు. అయితే కేసీఆర్ తో వెళ్లే అంశంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకుండా మౌనం దాల్చారు. 

తాజాగా ఆయన కలిసిన మరో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఫెడరల్ ఫ్రంట్ కూర్పులో భాగంగా కేసీఆర్ సోమవారం ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. 

కేసీఆర్ నవీన్ పట్నాయక్ ను కలిసిన మరుసటి రోజే ఒడిషా రాష్ట్ర ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడను కలిశారు. తాజా రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. 

మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై ఇరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
 

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. చంద్రబాబు ఆరోపణలకు ఒడిసా సీఎం మద్దతు ప్రకటించారు.  ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలన్న చంద్రబాబు నిర్ణయానికి ఎంపీ సౌమ్యా రంజన్ రాయ్ మద్దతు పలికారు. 

మరోవైపు బీజేపీయేతర ఫ్రంట్ పై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తాము కూడా బీజేపీయేతర ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించినట్లు తెలుస్తోంది. అందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు చర్చించారు.

 మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అంశం పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. దీనిపై అంతా కలిసి పోరాడదామంటూ సీఎం నవీన్ పట్నాయక్ చంద్రబాబుకు లేఖ రాసినట్లు సమాచారం. 

మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఒడిషాలో ముంపు ప్రాంతాలపైనా చర్చించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు అంశంలో ఏవైనా సమస్యలు ఉంటే కూర్చుని సామరస్యంగా చర్చించుకుందామని చంద్రబాబు నాయుడు సౌమ్యారంజన్ నాయక్ కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. 

 

ఈ వార్తలు  కూడా చదవండి

ఫెడరల్ ఫ్రంట్: కేసిఆర్ కు మమతా బెనర్జీ ఝలక్