నవయుగకే పోలవరం.. ట్రాన్స్ స్ట్రాయ్ సంగతేంటి ?

First Published 19, Jan 2018, 8:04 AM IST
Navayuga to take up polvaram project works
Highlights
  • నవయుగ కాంట్రాక్టు సంస్ధకే పోలవరం పనులు అప్పగించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

నవయుగ కాంట్రాక్టు సంస్ధకే పోలవరం పనులు అప్పగించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. పాత ధరలకే నవయుగ సంస్ధ పోలవరం పనులను చేపడుతుందని చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. వచ్చే నెలలో పనులు మొదలవుతాయి. కొద్ది నెలలుగా పోలవరం పనులు దాదాపు ఆగిపోయిన సంగతి తెలిసిందే. పనులను చేయాల్సిన ట్రాన్స్ స్ట్రాయ్ చేతెలెత్తేయటంతో పనులు దాదాపు ఆగిపోయాయి. ఆ నేపధ్యంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన అందరికీ తెలిసిందే.

ఈ సమయంలోనే పాత రేట్లకు పనులు చేయటానికి ట్రాన్ట్ స్ట్రాయ్ అంగీకరించకపోవటంతో అంచానలు సవరించాలని చంద్రబాబు పట్టబట్టారు. అంటే ఇప్పటి ధరలకన్నా అంచనాలను మరింత పెంచి మళ్ళీ ట్రాన్ట్ స్ట్రాయ్ కే పనులు కట్టబెట్టాలన్నది చంద్రబాబు ఆలోచన.  వందల కోట్ల ప్రజాధనం లూటీ చేయటానికే చంద్రబాబు ప్లాన్ చేశారంటూ వైసిపి ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, అంచనాలు పెంచినా ట్రాన్ట్ స్ట్రాయ్ పనులు చేసే అవకాశం లేదని తేలగానే కాంట్రాక్టు సంస్ధ మార్పుపై చంద్రబాబు పట్టుబట్టారు. దాన్ని కేంద్ర అంగీకరించలేదు.

ఇటువంటి నేపధ్యంలోనే నవయుగ సంస్ధ ముందుకొచ్చింది. అంచనాలు సవరించకుండానే, పాత ధరలకే తాము పనులు చేస్తామంటూ చెప్పటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే, అంచనాలు సవరించకుండానే ట్రాన్ట్ స్ట్రాయ్ చేయలేకపోయిన పనులను నవయుగ మాత్రం ఎలా చేయగలుగుతుందనే ప్రశ్న మొదలైంది. సరే, తెరవెనుక ఏమి జరిగిందో తెలీదుకానీ నవయుగ సంస్ధకే పోలవరం పనులు అప్పగించేందుకు చంద్రబాబు అంగీకరించారు.

స్పిల్ వే, స్పిల్ వే ఛానల్, అప్రోచ్ ఛానల్, కాంక్రీట్ పనులన్నింటినీ ఇకనుండి నవయుగనే చేపడుతుంది. అన్నీ పనులూ నవయుగనే చేపడితే మరి ట్రాన్ట్ స్ట్రాయ్ ఏమి చేస్తుందన్నది పెద్ద ప్రశ్న. లాభాలు రాకపోయినా, కొంత నష్టం వచ్చినా సరే పోలవరం పనులు చేయటం ద్వారా నవయుగ సంస్ధకు మంచి పేరు వస్తుందని యాజమాన్యం చెబుతోందని చంద్రబాబు చెప్పటం గమనార్హం. ఏ సంస్ధైనా నష్టాలకు పనిచేస్తుందా? మహా అయితే వచ్చే లాభాలను తగ్గించుకుంటుందే కానీ నష్టాలకు పనిచేసేట్లయితే ఇక సంస్ధ నడపటం ఎందుకు? సరే, పనులు చేపట్టటంలో సంస్ధ ఉద్దేశ్యం ఏమైనా కానీ నిలిచిపోయిన పోలవరం పనులు త్వరలో ప్రారంభమవటం మంచిదే కదా?

loader