Asianet News TeluguAsianet News Telugu

జాతీయ మీడియా వాయించేసింది

  • ఒకపుడు చంద్రబాబు పాలన ఎలాగున్నా జాతీయ మీడియా మాత్రం బ్రహ్మాండమంటూ ఆకాశానికి ఎత్తేసేది.
  • ఇపుడదే జాతీయ మీడియా మాత్రం విచిత్రంగా చంద్రబాబుపై విరుచుకుపడిపోతోంది. అవకాశం దొరికితే చాలు వాయించేస్తోంది.
  • తమ సమస్యలను చెబుతున్న వారిపై చంద్రబాబు ఏ విధంగా మాట్లాడిందీ న్యూస్ 18 9 నిమిషాల క్లిప్పింగులను ప్రసారం చేసింది.
National media criticizing naidus attitude towards public

చంద్రబాబునాయుడు వైఖరిని జాతీయమీడియా వాయించేస్తోంది. తన ప్రభుత్వాన్ని ప్రశ్నించటాన్ని, సమస్యలు ఏకరవుపెట్టటాన్ని ఏమాత్రం సహించలేని చంద్రబాబు మనస్తత్వాన్ని, జనాలను బెదిరిస్తూ మాట్లాడటాన్ని జాతీయ ప్రముఖంగా ఎత్తిచూపుతోంది. తాజాగా ‘న్యూస్ 18’ ఛానల్ 9 నిమిషాల పాటు చంద్రబాబు బెదిరింపులను ప్రసారం చేయటం గమనార్హం. ఒకపుడు చంద్రబాబు పాలన ఎలాగున్నా జాతీయ మీడియా మాత్రం బ్రహ్మాండమంటూ ఆకాశానికి ఎత్తేసేది. అప్పట్లో జాతీయ మీడియాపై హైదరాబాద్ మీడియా వ్యంగ్యాస్త్రాలు విసురుతుండేది.

అయితే, కాలం ఎల్లకాలం ఒకేలాగుండదు కదా? ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలోని మీడియా అంటే సాక్షితప్ప ఇంకెవరూ చంద్రబాబు పాలనలోని డొల్లతనాన్ని, లోపాలను ఎత్తిచూపే పరిస్ధితి లేదు. పోనీ బహిరంగ సభల్లో సిఎం మాట్లాడుతున్న మాటలనైనా చూపుతున్నారా అంటే అదీ లేదు. అంతటి స్వామి భక్తి ప్రదర్శిస్తోంది చంద్రబాబు మీడియా. అయితే, అదే సమయంలో జాతీయ మీడియా మాత్రం విచిత్రంగా చంద్రబాబుపై విరుచుకుపడిపోతోంది. అవకాశం దొరికితే చాలు వాయించేస్తోంది.

National media criticizing naidus attitude towards publicతాజాగా నంద్యాలలో చంద్రబాబు పర్యటన, ప్రసంగాలను తూర్పారపడుతోంది. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా గోస్పాడు మండలంలోని యాలూరులో చంద్రబాబు ప్రసంగించారు లేండి. ఏదో తమ గ్రామానికి వచ్చిన చంద్రబాబు వచ్చారు కదా సమస్యలను చెప్పుకుందామని గ్రామస్తులనుకున్నారు. తమ సమస్యలను చెబుతున్న వారిపై చంద్రబాబు ఏ విధంగా మాట్లాడిందీ న్యూస్ 18 9 నిమిషాల క్లిప్పింగులను ప్రసారం చేసింది. ఇపుడదే జాతీయస్ధాయిలో చంద్రబాబుకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

ప్రజాసమస్యలు వినటంలో చంద్రబాబు చూపుతున్న అసహనాన్ని న్యూస్ 18 స్పష్టంగా ఎత్తిచూపింది. సమస్యలు ప్రస్తావించిన వారిని ‘వీడే పార్టీ..వైఎస్ఆరా..జగన్మోహన్ రెడ్డి పంపారా, అరెస్టులు చేయిస్తా’ అంటూ విరుచుకుపడటాన్ని ప్రముఖంగా ప్రసారం చేసింది. ‘చంద్రబాబును ప్రశ్నిస్తే అరెస్టులే’ అన్న వ్యాఖ్యలతో వార్తను ప్రసారం చేసింది. ఆమధ్య ఇఫ్తార్ విందు సందర్భంగా రేషన్, పింఛన్, రోడ్లు తదితరాలపై జనాలను బెదిరంచటాన్ని కూడా ప్రస్తావించింది. ఈ విధంగా జాతీయ మీడియా ప్రధానంగా చంద్రబాబు వైకరిపైనే ఫోకస్ పెట్టినట్లుంది చూస్తుంటే. ఎందుకంటే, రాష్ట్రంలోని మీడియా కప్పిపెడుదామని ఎంత ప్రయత్నిస్తున్నా చంద్రబాబు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలన్నింటినీ జాతీయమీడియా మాత్రం ఉతికి ఆరేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios