అమరావతి: రాష్ట్రానికి పట్టిన చెదలు వదిలిన తర్వాత అందరూ సంక్రాంతి సంబరాలను  సరదాగా చేసుకొందామని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు.

సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టింగ్ లపై ఆయన ఘాటుగా స్పందించారు. వైసీఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఓ పెద్ద మనిషి ఆదేశాలతో ఎంపీ కనపడుట లేదని పెట్టిన పోస్టులపై ఆయన మండిపడ్డారు. తన ఆచూకీ తెలపాలని కొందరు తనను రకరకాలుగా బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తాను తన నియోజకవర్గానికి వెళితే ఏదో సాకుతో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తనకు తెలిసిందన్నారు. తాను తన నియోజకవర్గంలోని ఎస్‌సీ సామాజిక వర్గానికి చెందిన అధికారిని ఏదో అన్నానని ఏమంటానో కూడ ముందే రాసిపెట్టుకొన్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పైస్థాయి నుండి వచ్చిన ప్లాన్ ప్రకారంగా అరెస్ట్ కు రంగం సిద్దం చేశారని ఆయన ఆరోపించారు. 

తన సెక్యూరిటీని తొలగించేందుకు ప్రయత్నించారు... సాధ్యం కాలేదు. తనపై అనర్హత వేటు వేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు... కానీ ఆ ప్రయత్నాలు ఫలించవని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలను ప్రజలంతా పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. తాను నియోజకవర్గానికే పరిమితం కాకుండా  రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చెప్పారు. 

ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తనకు తెలుసునన్నారు.  రాష్ట్రంలో న్యాయానికి సంకెళ్లు వేయడానికి ప్రయత్నంలో కొంతమంది చెదల్లా ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అలాంటి చెద పురుగుల్ని నాశనం చేసే శక్తి న్యాయస్థానాలకు ఉందని చెప్పారు. ఆ చెదపురుగులు ఎవరో ప్రజలకు తెలుసునన్నారు.