న్యూఢిల్లీ: రాజీనామా చేస్తే  మూడు రెట్లు ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమాను వ్యక్తం చేశారు. అయినా పెయిడ్ ఆర్టిస్టుల డిమాండ్లను తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

బుధవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా  చేయాలనే డిమాండ్ పై ఆయన ఘాటుగా స్పందించారు. తప్పులు జరుగుతున్నాయి.. సరిదిద్దుకోవాలని చెబితే రాజీనామా చేయాలని కోరుతారా అని ఆయన ప్రశ్నించారు.తప్పులను సరిదిద్దుకోవాలని ఆయన కోరారు.

నిజాలు మాట్లాడితే కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. తాను తప్పుగా మాట్లాడుతున్నానని అరెస్ట్ చేయాలని కొందరు పెయిడ్ ఆర్టిస్టులు కేసులు పెడతారని పిచ్చి గోల పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

పీపీఈ కిట్లు లేవని ఎప్పుడో కామెంట్ చేస్తే డాక్టర్ గంగాధర్ లాంటి ప్రముఖ వైద్యులకు ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. నోరు విప్పితే భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.. చిత్తూరులో దళిత యువకుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని  వైసీపీ ప్రభుత్వం వేధించి బలి తీసుకొందని ఆయన ఆరోపించారు.

బెదిరింపులకు ప్రజలు ఎవరూ కూడ భయపడొద్దన్నారు ఎంపీ. తనకు కూడ బెదిరింపులు వస్తున్నాయన్నారు. ఎవరూ చలించకండన్నారు. ఎవర్నీ ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ధైర్యంగా ఏమీ కాదన్నారు. తనపై సోషల్ మీడియాలో ఓ మహిళ రక రకాలుగా విమర్శలు చేశారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.