విశాఖ ఉక్కు ప్లాంట్ కు కేంద్రం షాక్: మోడీ చెప్పింది అదే...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తప్పదని స్పష్టమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. జగన్ గానీ, చంద్రబాబు గానీ దాన్ని ఆపలేని పరిస్థితే ఉంది.
విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. విశాఖ ఉక్కు మన హక్కు అనే ఉద్యమం ఎంత సాగినా, రాజకీయ పార్టీలూ, ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తప్పదని అర్థమవుతోంది.
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను బట్టి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రేవైటీకరించడానికే కేంద్రం నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ బిడ్ కు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నష్టాల్లో ఉన్న ప్రబుత్వ రంగ సంస్థల (పీఎస్ యూల) ప్రైవేటీకరణ తప్పదన ప్రధాని స్పష్టం చేశారు
ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరని ఆయన అన్నారు. యాభై, ఆరవై ఏళ్లనాటి పరిస్థితులు ఇప్పుడు లేవని, ఇప్పటి దేశ అవసరాలు వేరని ఆయన అన్నారు. అనేక ప్రబుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, వాటికి నిధులు సమకూరుస్తూ పోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని ఆయన అన్నారు
వారసత్వంగా వస్తున్నాయన, పాత సంస్థలని చెప్పి వాటిని నడపలేమని మోడీ అన్నారు. కొంత మందికి మాత్రమే ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం, ప్రజా వికాసం మాత్రమే ప్రభుత్వం పని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల గురించి మాట్లాడారు. అయితే ఆయన మాటలు విశాఖ ఉక్కు ప్లాంట్ కు కూడా వర్తిస్తుంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తప్పదనే విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుసు. ఆర్థిక సంస్కకరణలను వేగంగా అమలు చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తోంది. దీని నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం తప్పించుకోలేదు.
చంద్రబాబు గానీ జగన్ గానీ రాజకీయాల కోసమే విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. బిజెపి, జనసేనలు ఏవి మాట్లాడినా విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదనేది స్పష్టమవుతోంది. రాజకీయ పార్టీలన్నింటికీ ఆ విషయం తెలుసు. కానీ రాజకీయ ప్రయోజనాలే వారిని ముందుకు నడిపిస్తాయి.