Asianet News TeluguAsianet News Telugu

ఆ కుట్రలో భాగమేనా..? అంతర్వేది ఆలయ రథం దగ్దంపై అనుమానాలు: రఘురామ సంచలనం(వీడియో)

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో రథం మంటల్లో కాలిపోవడం దురదృష్టకరమన్నారు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు.   

narasapuram mp raghurama krishnamraju reacts antarvedi temple chariot catches fire
Author
Narasapuram, First Published Sep 6, 2020, 2:42 PM IST

న్యూఢిల్లీ: తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంపై నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ స్వామివారి దేవాలయంలో రథం కాలిపోవడం దురదృష్టకరమన్నారు.   

''అంతర్వేది రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రథం కాలిపోయిన విధానం చూస్తుంటే ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఒక మతంపై జరిగిన దాడిలా ప్రజలు భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సంబంధిత మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి జగనే దీనిపై ప్రకటన చేయాలి'' అని ఎంపీ సూచించారు. 

''ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగిన ఒక పిచ్చివాడు చేశాడంటూ కేసులు కొట్టేస్తున్నారు. అలా కాకుండా విచారణ జరిపించి బాధ్యులెవరైనా, ఏ మతస్థులైన కఠినంగా శిక్షించాలి.రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

వీడియో

అలాగే ఈ అగ్నిప్రమాదంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కూడా విచారం వ్యక్తం చేశారు. ''అంతర్వేది ఘటన దురదృష్టకరం. రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి. దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిదని అన్నారు. స్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి'' అని స్వరూపానందేంద్ర వైసిపి ప్రభుత్వానికి సూచించారు. 

మరోవైపు అంతర్వేది ఆలయంలో రథం దగ్ధంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. ఈ విషయమై విచారణకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ను రాష్ట్ర ప్రభుత్వం విచారణ అధికారిగా నియమించింది. ఈ మేరకు ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

 ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  దేవాదాయ శాఖ కమిషనర్ కు, జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నులను అడిగి తెలుసుకొన్నారు.

అంతర్వేదిలో రథం దగ్ధం కావడంపై  దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ను విచారణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆదివారం నాడు తెల్లవారుజామున రథం  అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి చెందారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios