నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి హిందూపురంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆమెకు ఓ అపురూపమైన అనుభవం ఎదురయ్యింది. 

హిందూపురం : గురువారం హిందూపురంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ‘నిజం గెలవాలి’ పేరుతో నారాభువనేశ్వరి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో వారానికి మూడు రోజులు ఈ యాత్ర చేస్తున్నారు. వాళ్ల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తున్నారు. 

దీంట్లో ఈ వారం నారా భువనేశ్వరి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం హిందూపురం చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు అరెస్ట్ సమయంలో మృతి చెందిన వారిని పరామర్శిస్తున్నారు. సింగనమల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త హేమంత్ యాదవ్, శోభాయాదవ్ ల ఇంటికి వెళ్లారామె. స్వయంగా నారా భువనేశ్వరి తమ ఇంటికి రావడంతో సంతోషించిన ఆ దంపతులు తమ రోజుల చిన్నారికి పేరు పెట్టాల్సిందిగా కోరారు.

ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు కొట్టివేయడానికి ఐదు ముఖ్యమైన కారణాలివే..

ఆ చిన్నారిని ఎత్తుకున్న నారా భువనేశ్వరి, అతనికి కుశల్ కృష్ష అని నామకరణం చేశారు. దీంతో ఆ దంపతుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది. ఆ పేరు తమకు ఎంతో నచ్చిందని తెలిపారు. నారా భువనేశ్వరి కూడా వారి అభిమానానికి పొంగిపోయారు. ఓ వైపు ఇలా వారిని పరామర్శిస్తూనే తన యాత్రలో భాగంగా అక్కడి స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు అటెండ్ అవుతున్నారామె. 

చంద్రబాబు ప్రజల మనిషి అని, ఆయన ధ్యాసంతా ప్రజలు, కార్యకర్తల గురించేనన్నారు. రాష్ట్ర ప్రజలు తమ కుటుంబంమీద చూపిస్తున్న అభిమానాన్ని, తమకు అండగా నిలబడ్డ విధానం ఎప్పుడూ మరవలేనిదన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు శ్రమించారని, ప్రతీ జిల్లాను ఒక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారని అన్నారు. కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెల్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరెస్టులు, కేసులు పెట్టడాల్లో నెంబర్ వన్ గా మారిపోయిందన్నారు. 

ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.10 ని.లుకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు తిరుగుపయనం కానున్నారు.