అమరావతి: విజయ్ కుమార్ రెడ్డికి తాను అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. విజయ్ పోస్టు చేసిన వీడియోను తాను కూడా పోస్టు చేస్తున్నానని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆయన సవాల్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ ఓ యువకుడు వీడియో పోస్టు ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశాడని ఆయన చెప్పారు.

ఆ వీడియోను పోస్టు చేసినందుకు పులివెందులకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్ిడని అక్రమంగా అరెస్టు చేశారని లోకేష్ విమర్శించారు. ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టేంత పెద్ద తప్పు విజయ్ కుమార్ రెడ్డి ఏం చేశాడని ఆయన ప్రశ్నించారు. 

కేంద్రం మెడలు వంచేస్తానన్న వస్తాదు సామాజిక మాధ్యమంలో వస్తున్న పోస్టులకు ఎందుకు భయపడుతున్నారని నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశ్నించారు. పులివెందుల పులి అంటూ డప్పు కొట్టించుకున్న జగన్ ఇప్పుడు పిల్లి అయ్యారా అని అడిగారు. 

అమ్మ ఒడి పథకం కోసం బడుగు, బలహీన వర్గాలకు చెందాల్సిన రూ.6,500 కోట్లను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని లోకేష్ విమర్శించారు.