గుంటూరు: ఏడాది కాలంగా జగన్ చేస్తున్న దుర్మార్గపు పాలన వలన  భవన నిర్మాణ రంగం కుదేలయ్యిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు, సభ్యులతో టెలీకాన్ఫిరెన్స్ ద్వారా సమావేశమయ్యారు లోకేష్. 

అ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ఏడాదిలో భవన కార్మిక నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. సీఎం జగన్  తప్పుడు విధానాల వలన 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఒక్క కార్మికుడు కూడా ఆకలితో పస్తులున్న సందర్భాలు లేవన్నారు. కానీ నేడు 40 లక్షల మంది కార్మికులు ఆకలితో పస్తులుండాల్సిన పరిస్థితి దాపుచిందన్నారు.  

''భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లు, చంద్రన్న భీమా, పెళ్లి  కానుక వంటి పథకాలను దిగ్విజయంగా అమలు చేసింది. జగన్ ప్రభుత్వం వాటన్నింటిని కక్ష పూరితంగా రద్దు చేసి కార్మికుల పొట్ట కొట్టింది. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘంలో ఉన్న రూ. 2000 కోట్లు పక్కదారి పట్టించారు'' అని ఆరోపించారు. 

read more   అలా కాదు ఇలా అని నేను చంద్రబాబుకి చెప్పా... నువ్వు జగన్‌కి చెప్పలేవా: బొత్సపై అయ్యన్న వ్యాఖ్యలు

''13 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మాయం అవ్వడం ఇసుక దోపిడికి అద్దం పడుతుంది. ఇంత వరకు ఒక్క రూపాయి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయలేదు. ఇసుక అక్రమ రవాణాతో వైకాపా నేతలు కోట్లు గడిస్తుంటే భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం టిడిపి పోరాడుతుంది'' అని అన్నారు. 

''భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తాం. కార్మికులకు తక్షణమే  రూ.10 వేల ఆర్ధిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం.అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం'' అని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత వలన, ప్రభుత్వ అసమర్ధ నిర్ణయాలతో ఎదుర్కొంటున్న సమస్యలని భవన నిర్మాణ కార్మికులు లోకేష్ కి వివరించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో తెలుగుదేశం నాయకులు పట్టాభి, టిఎన్టియూసి నేత రఘురాం, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం సంఘం ఛైర్మన్ సూరం రాజాతో పాటు అన్ని జిల్లాల సభ్యులు పాల్గొన్నారు.