అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరుస ట్వీట్లతో దుయ్యబట్టారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అని ఐటి శాఖ మంత్రి ప్రకటించారని ఆయన వ్యాఖ్యానించారు ప్రభుత్వం చేతగానినతనం వల్లనే ఆదాని కంపెనీ ఏపీ నుండి వెళ్లిపోయిందని ఆయన అన్నారు. 9 నెలల్లో ఒక్క కంపెనీని కూడా తీసుకు రాలేనివాళ్లు ఆదానీ సొంత అవసరాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోతుందని అనడం వారి చేతగానితనాన్ని బయటపెట్టడమేనని అన్నారు.

"రూ.70 వేల  కోట్ల పెట్టుబడి, 28 వేల మందికి ప్రత్యక్షంగానూ, 85 వేల మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు కల్పించే అదానీ కంపెనీని తుగ్లక్ సేన తరిమేసింది. ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతకి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నారు" అని ఆయన అన్నారు.

 

"ఉన్న ఉద్యోగస్తులను తరలించడం అభివృద్ధి వికేంద్రీకరణో, యువతకి కొత్త ఉద్యోగాలు కల్పించడం అభివృద్ధి వికేంద్రీకరణో ఆలోచించండి" అని జగన్ కు హితవు పలికారు.

"మాయమాటలు చెప్పటానికే కర్నూలు వెళ్ళారా గారు?" అని ప్రశ్నిస్తూ నారా లోకేష్ వైఎస్ జగన్ ను ట్యాగ్ చేశారు. "నిన్నటి మీ పర్యటనలో కర్నూలుజిల్లా గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? తెలుగుదేశం ప్రభుత్వం మొదలు పెట్టిన వేదవతి, గుండ్రేవుల, ఆర్‌డీఎస్ కుడికాలువ,ఎల్లెల్సీ బైపాస్‌ కెనాల్‌ వంటి ప్రధాన ప్రాజెక్టుల గురించి ప్రస్తావన ఏది" అని ఆయన ప్రశ్నించారు.  

"ఓర్వకల్లు పారిశ్రామికవాడ, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లో విత్తనోత్పత్తి కేంద్రాలు, కర్నూలు-అమరావతి రహదారి విస్తరణ, జిల్లాలో సాగునీటి సమస్య వంటి ఎన్నో అంశాలుండగా వాటి గురించి ఒక్క మాటా మాట్లాడలేదు ఎందుకని?అవన్నీ గత ప్రభుత్వం మొదలు పెట్టింది కాబట్టి మీకు అనవసరం అనుకున్నారా?" అని నారా లోకేష్ అన్నారు.

"చంద్రబాబుగారు మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లు పూర్తి చెయ్యకూడదు అనే మీ ధోరణి చూస్తే, మీకు ఎంత కడుపు మంటో అర్ధమవుతుంది. మీరు నిన్న చెప్పినట్టు, నిజంగానే మీ కడుపు మంటకు మందు లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.