అమరావతి: క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి ధర్నా చేస్తే తనకేం సంబంధమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన ఆరోపణల మీద ఆయన గురువారం స్పందించారు. 

పవన్ కల్యాణ్ చుట్టూ కొందరు చేరి తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమపై తనకు అవగాహన లేదని, వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అంటే తనకు గౌరవమేనని ఆయన అన్నారు. తనపై చేసిన ఆరోపణల మీద ఆధారాలు ఉంటే పవన్ కల్యాణ్ చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేయడం వల్ల వైసిపిలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక వాయిదా పడిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రధాని నమ్మించి మోసం చేశారని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన తిరుపతిలో మీడియాతో అన్నారు.

బిజెపి నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 30వ తేదీన జరిగే టిడిపి బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దేశం మొత్తం చర్చించే విధంగా తిరుపతి సభ నిర్వహిస్తామని అన్నారు. 

హోదా సరైందేనని అన్న బిజెపి ఇప్పుడు మాట మార్చిందని ఆయన అన్నారు. మనకు ఇష్టం లేకున్నా రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. ఢిల్లీపై జగన్, పవన్ నోరు మెదపడం లేదని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు కేంద్రంపై పులిలా పోరాడుతుంటే జగన్ పిల్లిలా గ్రామాల్లో తిరుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.