ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై ప్రముఖ ఆద్యాత్మికవేత్త చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ టిడిపి నాయకుడు నారా లోకేష్ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్ల దుస్థితి అద్వాన్నంగా తయారయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై టిడిపి, జనసేన పార్టీలు నిరసనలు కూడా చేపట్టాయి. ఇటీవల తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్ కూడా ఏపీలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా వుందంటూ సెటైరికల్ గా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. తాజాగా ప్రముఖ ఆద్యాత్మికవేత్త చినజీయర్ స్వామి కూడా ఏపీలో రోడ్ల పరిస్థితి గురించి ప్రవచనంలో సెటైరికల్ కామెంట్స్ చేయగా అందరూ నవ్వుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
''రాష్ట్రంలో రోడ్లు నడిచేందుకు కూడా వీలుగా లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. పక్కరాష్ట్ర పాలకులు అధ్వాన పాలనకి ఉదాహరణగా మన ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వ స్పందన శూన్యం. రాజకీయాలకు దూరంగా, ఆధ్మాత్మిక ప్రపంచానికి దగ్గర, హిందూ ధర్మ ప్రచారమే జీవితలక్ష్యంగా సాగుతోన్న చినజీయర్ స్వామి ఆంధ్రప్రదేశ్ లో రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారు'' అని లోకేష్ పేర్కొన్నారు.
''గతుకులు-గుంతలు, ఒడిదుడుకుల గురించి ప్రస్తావిస్తూనే... జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వరకూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుందని రోడ్ల దుస్థితిని భక్తులకు చెబుతున్నట్టే ప్రవచనంలో భాగంగానే వ్యాఖ్యానించడం చూస్తుంటే... జగన్ రెడ్డి పాలనలో రహదారులు ఎంత దారుణంగా వున్నాయో స్పష్టం అవుతోంది'' అని లోకేష్ అన్నారు.
అసలు చినజీయర్ స్వామి ఏమన్నారంటే...
ఓ ఆద్యాత్మిక కార్యక్రమంలో భాగంగా చినజీయర్ స్వామి ఏపీలోని జంగారెడ్డిగూడెం నుండి రాజమండ్రికి రోడ్డుమార్గంలో ప్రయాణించారు. రాజమండ్రిలో ప్రవచనం చేస్తున్న సమయంలో ఈ ప్రమాణం గురించి ప్రస్తావించారు. ''ప్రయాణం చేసేటపుడు ఒడిదుడుకులు వుంటాయి... ఒక్కోసారి గోతులు ఎక్కువ వుండొచ్చు... కానీ జంగారెడ్డిగూడెం నుండి ఇక్కడికి రావడానికి... చాలా బావుంది... చక్కగా జ్ఞాపకం వుండేలా వుంది'' అంటూ రోడ్లు అద్వాన్నంగా వున్నాయని చెప్పకుండానే రోడ్ల దుస్థితిగురించి తెలిపాడు. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నంతసేపు ప్రవచనం వింటున్నవారు గొళ్లున నవ్వుకున్నారు.
Video
కేటీఆర్ వ్యాఖ్యలు:
ఇటీవల తెలంగాణ మంత్రి కెటీఆర్ ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితుల గుర్తించి సెటైర్లు వేసారు. పక్కరాష్ట్రం ఏపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని తనకు ఇటీవలే అక్కడికి వెళ్లివచ్చిన ఓ స్నేహితుడు చెప్పాడని కేటీఆర్ ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలోని అన్ని నగరాల్లో కెల్లా హైదరాబాదే అత్యుత్తమ నగరంగా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అద్వాన్నంగా వుండటమే కాదు, కనీసం కరెంట్, త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అనుమానం ఉంటే ఎవరైనా పక్క రాష్ట్రానికి కార్లు వేసుకొని వెళ్లి రావాలన్నారు కేటీఆర్. పక్క రాష్ట్రానికి పోయివచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత బాగున్నాయో తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన అద్భుతంగా ఉందన్నారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో రోడ్లు, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. పక్కరాష్ట్రంలో కరెంటు లేదు. నీళ్లు లేవు అన్నారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటించి వాస్తవాలు తెలుస్తాయి. పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీ, ప్రతిపక్షాలకు లంచాలు ఇస్తేనే అనుమతులు వస్తాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు.
