దళిత యువకుడి ముఖంపై మూత్రం పోసినవారిపై ఇలాంటి చర్యలా..: జగన్ సర్కార్ పై లోకేష్ సీరియస్
కంచికచర్లలో దళిల యువకుడి ముఖంపై మూత్రంపోసి దాడికి పాల్పడిన దుండగులపై పోలీసులు బెయిలబుల్ కేసులు పెట్టడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో దళితులపై వరుసగా జరుగుతున్న దాడులకు వైసిపి ప్రభుత్వ తీరే కారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం దళితులపై దాడుకు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంతో ఇవి మరింత ఎక్కువ అవుతున్నాయన్నారు. వైసిపి పెద్దలు, ప్రభుత్వంలోని నాయకుల అండదండలతోనే దళితులపై దాడులు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు.
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో దళితుడైన నిప్పుల కోటేశ్వరరావు కుటుంబంపై వైసిపి నాయకుడు దాడికి పాల్పడ్డాడని లోకేష్ తెలిపారు. స్థానిక వైసిపి నాయకుడు ముత్తారెడ్డి కులంపేరుతో కోటేశ్వరరావును దూషించి తీవ్రంగా అవమానించడమే కాదు దాడికి పాల్పడ్డాడని తెలిపారు. తన కుటుంబంపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకుడన్న భయంతో ముత్తారెడ్డిపై కేసు నమోదు చేయలేదని తెలిపారు. కోటేశ్వరరావు ఫిర్యాదును పోలీసులు అసలు పట్టించుకోలేదని లోకేష్ తెలిపారు.
వైసిపి నాయకుడి చేతిలో దాడి తర్వాత గాయాలతో నందిగామ ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన కోటేశ్వరరావు కుటుంబానికి వైద్యం అందించేందుకు సైతం వైద్యులు నిరాకరించారంటే రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థమవుతుంది. బాధిత కుటుంబంతో పోలీసులు, వైద్యులు వ్యవహరించిన తీరు చూస్తుంటే జగన్ ప్రభుత్వ అండదండలతోనే దళితులపై దమనకాండ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోందని లోకేష్ పేర్కొన్నారు.
Read More Nara lokesh : పిచ్చోడి పాలన ఫలితం...ప్రజారోగ్యం గాలిలో దీపం - టీడీపీ నాయకుడు నారా లోకేష్..
ఇదిలావుంటే కంచికచర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ దాడికి పాల్పడిన ఘటనపైనా లోకేష్ స్పందించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన దళిత యువకుడు దాహంగా వుంది నీళ్లు కావాలని అడిగితే ముఖంపై మూత్రంపోయడం దారుణమని అన్నారు. ఇలా దళిత యువకుడిని చావబాది ముఖంపై మూత్రంపోసిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించకుండా చిన్నచిన్న కేసులు పెట్టారని లోకేష్ అన్నారు.
దళిత యువకుడిపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు బెయిలబుల్ కేసులు నమోదుచేయడం చూస్తుంటే ప్రభుత్వంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. దళితులపై జరుగుతున్నవన్నీ ప్రభుత్వ ప్రాయోజిత దాడులేనని స్పష్టమవుతోందని అన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకపర్వంపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ మానవహక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలి... దళితులకు రక్షణ కల్పించాల్సిందిగా నారా లోకేష్ విజ్ఞప్తి చేసారు.