అరెస్ట్ పై జోరుగా ప్రచారం... దేశ రాజధానిలోనే లోకేష్... పాదయాత్రపై కీలక నిర్ణయం
చంద్రబాబు అరెస్ట్ తో లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. తాజాగా ఎక్కడయితే పాదయాత్ర ఆగిందో అక్కడినుండే తిరిగి ప్రారంభించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్టవడంతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే వచ్చేవారం తన పాదయాత్రను తిరిగి ప్రారంభించడానికి లోకేష్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పాదయాత్ర నిలిచిన చోటునుండే తిరిగి ప్రారంభించాలని యువతనే లోకేష్ భావిస్తున్నట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలపై లోకేష్ టిడిపి ముఖ్య నేతలతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈ క్రమంలోనే యువగళం పాదయాత్ర పున:ప్రారంభం గురించి కూడా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వచ్చేవారం నుండే పాదయాత్రను తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయానికి లోకేష్ వచ్చినట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు. పాదయాత్ర ఆగిన
తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుండే తిరిగి ప్రారంభించనున్నారట.
ఇకపై పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాదు చంద్రబాబు అక్రమ అరెస్ట్ గురించి ప్రజలకు వివరించాలని లోకేష్ భావిస్తున్నారట. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు తప్పేమీ లేదని... రాజకీయ కక్షలో భాగంగానే ఆయనపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారని ప్రజలకు వివరించనున్నారట. అలాగే సీఎం వైఎస్ జగన్ అవినీతి, అక్రమాలపై మరింత గట్టిగా గళం వినిపించాలని... అందుకోసం యువగళం పాదయాత్రను ఉపయోగించుకోవాలన్నది లోకేష్ ఆలోచనగా టిడిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
Read More రెండో రోజు చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ.. నేటితో ముగియనున్న బాబు రిమాండ్ గడువు..
ఇదిలావుంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు అరెస్ట్ ను ఖండించి కష్టకాలంలో టిడిపికి, తమ కుటుంబానికి మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించడానికే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. అయినా ప్రజలు వైసిపి దుష్ఫ్రచారాన్ని నమ్మడం లేదని... చంద్రబాబుకు మద్దతుగా నిలిచారన్నారు. టిడిపి నేతల నిరసనల్లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొంటున్నారని... దీంతో ప్రభుత్వం పోలీసులతో భయపెట్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఆందోళనలను అణచివేయడం... అక్రమ కేసులు పెట్టి బెదిరించడం చేస్తున్నారంటూ లోకేష్ తో పాటు టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ప్రస్తుతం చంద్రబాబును జైలునుండి బయటకు తీసుకురావడంకోసం న్యాయవాదులతో సంప్రదింపులు, జాతీయ పార్టీల మద్దతు కోసం లోకేష్ దేశ రాజధానిలో వున్నారు. అయితే ఏపీకి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేయనున్నారని... అందువల్లే ఆయన డిల్లీలోనే వుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తెరదించుతూ వచ్చేవారం పాదయాత్ర ప్రారంభించే ఆలోచనలో లోకేష్ వున్నట్లు తెలుస్తోంది.
అటు తండ్రి అరెస్ట్ పై లీగల్ ఫైట్ కొనసాగిస్తూనే ఇటు యువగళంతో మళ్ళీ రోడ్డెక్కాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం తన పాదయాత్ర ద్వారానే కాకుండా చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చెయ్యాలని లోకేష్ సూచించారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ నాయకులకు లోకేష్ సూచించారు.