రెండో రోజు చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ.. నేటితో ముగియనున్న బాబు రిమాండ్ గడువు..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు.

రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబును రెండు రోజులు విచారించేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. శనివారం తొలిరోజు విచారణ ముగియగా.. నేడు రెండో రోజు విచారణను కొనసాగిస్తున్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని సీఐడీ బృందం చంద్రబాబును ప్రశ్నిస్తుంది. చంద్రబాబు తరఫున న్యాయవాది విచారణ కనిపించే దూరంలో ఉండేందుకు అధికారులు అనుమతించారు. ఇక, ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు.. విచారణలో ప్రతి గంటకు ఐదు నిమిషాల బ్రేక్, మధ్యాహ్నం భోజన విరామం ఇవ్వనున్నారు.
ఇక, ఈరోజు విచారణ అనంతరం దర్యాప్తుకు సంబంధించి వీడియో ఫుటేజ్‌ను సీఐడీ అధికారులు సీల్డ్ కవర్‌లో విజయవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు చంద్రబాబుకు విధించిన రిమాండ్ కూడా నేటితో ముగియడంతో.. ఈరోజు సీఐడీ విచారణ అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.
ఇక, చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారుల బృందం శనివారం రెండు సెషన్‌లలో దాదాపు ఆరు గంటలపాటు విచారించింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం 40 నుంచి 45 ప్రశ్నలను మాత్రమే పూర్తి చేసినట్లు వర్గాలు తెలిపాయి. ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు సేకరించి.. వాటిని ఈ కేసులో సాక్షులు చెప్పిన వాటితో పోల్చి చూడనున్నారు. ఇక, రాజమండ్రి జైలులో చంద్రబాబు విచారణ నేపథ్యంలో.. జైలు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.