ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టిడిపి నాయకులు నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నవ్వుతూనే సుతిమెత్తగా అబద్దాలు ఆడటం జగన్ కు అలవాటైపోయిందని ఆరోపించారు.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) అబద్దాలకు అలవాటు పడ్డారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఆరోపించారు. అందువల్లే జంగారెడ్డిగూడెం (jaganreddigudem deaths) కల్తీ మరణాలు సహా అన్ని విషయాల్లోనూ జగన్ అలవోకగా అబద్దాలు ఆడేస్తున్నారని... నవ్వుతూ అబద్దాలు ఆడడం ఆయన నైజంగా మారిందని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం మరణాలపై తాము పోరాడుతుంటూ నాలుగు రోజులుగా సాగదీస్తున్నారంటూ ప్రభుత్వ పెద్దలు విమర్శించడం దారుణమని లోకేష్ అన్నారు.
''ప్రజల ప్రాణాలకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. ప్రజా సమస్యలపై మేం ఎప్పుడూ, ఎంతకాలమైనా పోరాడతూనే ఉంటాం. పేదల ప్రాణాలంటే జగన్ కు ఎంత లోకువో జంగారెడ్డిగూడెం వరుస మరణాల ఘటనతో స్పష్టమైంది. ప్రభుత్వం చెప్పినట్లు గూడెంలోవి సహజ మరణాలైతే పోలీసులు ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారు..? సారా బట్టీలపై ఎస్ఈబీ ఎందుకు దాడులు చేశారు..?'' అని జగన్ సర్కార్ ను లోకేష్ నిలదీసారు.
డిఎస్పీల ప్రమోషన్లపై వైసిపి తప్పుడుప్రచారం
''టీడీపీ హయాంలో డీఎస్పీల ప్రమోషన్ల విషయంలోనూ అలవాటు ప్రకారం జగన్ అబద్దాలాడేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి ప్రమోషన్లు ఇచ్చారంటూ మాపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. ఇలా చివరకు దేశ అత్యున్నత పదవిలోని రాష్ట్రపతి, ప్రధానిలకే అబద్దాలు చెప్పగలిగిన ఘనుడు జగన్'' అని లోకేష్ ఎద్దేవా చేసారు.
పెగాసెస్ వివాదం
''పెగాసెస్ సాప్ట్ వేర్ ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందనే ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులను మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరు. నిజంగానే పెగాసెస్ సాఫ్ట్ వేర్ మేం కొనుగోలు చేసివుంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా..? మాపై చర్యలు తీసుకోకుండా జగన్ మూడేళ్లపాటు ఆగి ఉండేవారా..?'' అని పేర్కొన్నారు.
''టీడీపీ తప్పులు వెతకడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ సహా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను జగన్ తనిఖీలు చేయించారు. కానీ ఎక్కడా మేము తప్పుచేసినట్లు బైటపడలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిజంగానే కామెంట్ చేసి ఉంటే ఆమెకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లి ఉండొచ్చు'' అన్నారు.
సీఆర్డీఏ చట్టం, రాజధాని అమరావతిపై కామెంట్స్
''సహజంగా అధికార పార్టీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఒప్పందాలు చేసుకుంటాయి... కానీ టిడిపి హయాంలో చంద్రబాబు ఆ పని చేయలేదు. వ్యవస్థలు శాశ్వతమని నమ్మే వ్యక్తి కాబట్టే సీఆర్డీఏ చట్టాన్ని రైతులకు అనుకూలంగా చేశారు. చంద్రబాబు ముందు చూపు వల్లే సీఆర్డీఏ చట్టం గెలిచింది'' అని లోకేష్ పేర్కొన్నారు.
''ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై వైసిపి ప్రభుత్వానికే స్పష్టత లేదు... కానీ ప్రతిపక్షంలో వున్న మాకు స్పష్టత ఉంది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని మా విధానం. కాబట్టి అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. కానీ పరిపాలన కేంద్రీతకృతంగా ఉండాలి'' అని మాజీ ఐటీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసారు.
