అమరావతి: అక్రమ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కుంటున్న గీతం విశ్వవిద్యాలయం నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేయడంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుందని, జగన్ రెడ్డికి మాత్రం విధ్వంసం కిక్ ఇస్తుందని ఆయన అన్నారు.

ట్వీట్టర్ వేదికగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్శిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట అని ఆయన అన్నారు. కరోనా కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గీతం ఆస్పత్రి సేవలు అందించిందని ఆయన గుర్తు చేశారు. 

ఎన్నో ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి, ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్శిటి విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతుందని ఆయన అన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారని ఆయన అన్నారు. 

మొన్న సబ్బం హరి ఇల్లు, ఇవాళ గీతం యూనివర్శిటీ అని ఆయన ట్వీట్ చేశారు. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డి అని ఆయన అన్నారు. విశాఖలో విధ్వంసం సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే జగన్ రెడ్డి లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.