గుంటూరు: విశాఖపట్నం టిడిపి నాయకులు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సన్నిహితులైన నలంద కిషోర్ హఠాన్మరణంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కిషోర్ ను ఇటీవల అరెస్ట్ చేసి వేధించారని... అందువల్లే  ఆయన మృతిచెందారని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని లోకేష్ ఆరోపించారు. 

''టిడిపి నాయ‌కుడు నలంద కిషోర్ మృతి చాలా బాధాక‌రం. పార్టీ ఓ క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన నాయ‌కుడ్ని కోల్పోయింది. కిషోర్ కుటుంబస‌భ్యుల‌కు నా ప్రగాఢ ‌సంతాపం తెలియ‌జేస్తున్నాను'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

''తెలుగుదేశం పార్టీ నాయకుడు నలంద కిషోర్ గారిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఆయన్ని ఎన్ని రకాలుగా హింసించారో ప్రత్యక్ష సాక్షి నందిగామకి చెందిన చిరుమామిళ్ల కృష్ణ మాటల్లో అర్థం అవుతుంది. కిషోర్ గారిని విశాఖపట్నం నుండి కర్నూలు తీసుకెళ్లి వేధించారు'' అంటూ ఓ వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశారు. 

 

 ''ప్రైవేట్ ఆసుపత్రి లో కరోనా టెస్ట్ చేయించుకుంటానని కిషోర్ గారు ప్రాధేయపడినా నిరాకరించిన పోలీసులు, కక్ష సాధింపులో భాగంగా తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 7 గంటల వరకూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉంచారు. ఆరోగ్యం బాగాలేని వ్యక్తిని మానసికంగా, శారీరకంగానూ పోలీసులు హింసించి చంపేసారు'' అంటూ ట్విట్టర్ వేదికన వైసిపి ప్రభుత్వంపై లోకేష్ మండిపడ్డారు. 

read more   పోలీసు స్టేషన్లు తిప్పి వేధించారు: నలంద కిశోర్ మృతిపై చంద్రబాబు

''అధికార పార్టీ తొత్తుల్లా మారి కొంత మంది పోలీసులు చేస్తున్న అరాచకాలు చూస్తున్నాం. శిరోముండనం ఘటన, మాస్క్ పెట్టుకోలేదని యువకుడిని కొట్టి చంపడం తాజా ఉదాహరణలు. టిడిపి కార్యకర్తలను, నాయకులను సోషల్ మీడియా పేరుతో వేధిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛని హరించే హక్కు జగన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు?కిషోర్ గారి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగింది. ఆయన్ని వేధించి, వెంటాడి చంపేశారు. ఆయన మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి'' అని నారా లోకేష్ అన్నారు.