నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబునాయుడు వ్యక్తిగత ఆస్తులు కేవలం రూ. 34 లక్షలు మాత్రమే. అదే నాలుగేళ్ళ వయస్సున్న మనవడు దేవాన్ష్ పేరుతో మాత్రం రూ. 11.54 కోట్ల ఆస్తులున్నాయి. ఎవరైనా నమ్ముతారా ఈ లెక్కలను. నారా లోకేష్ చెప్పారు కాబట్టి నమ్మితీరాల్సిందే. ప్రతీ ఏడాది ఉండే ఆస్తుల ప్రకటన అనే విన్యాసాన్ని లోకేష్ శుక్రవారం పూర్తి చేశారు.

ఐటి, పంచాయితీ శాఖ మంత్రి నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తులను ప్రకటించారు. వరుసగా 7వ సారి తమ ఆస్తులను ప్రకటిస్తున్నట్లు లోకేష్ చెప్పారు. తమ కుటుంబం ఆస్తులన్నీ పాలు, కూరగాయలమ్మే ఓ పద్దతిగా సంపాదించినట్లు చెప్పారు. తమకు కూరగాయలు, పాల వ్యాపారం తప్ప ఇతరత్రా వ్యాపారాలేవీ లేవని, కొన్ని ఆస్తులపై అద్దెలు మాత్రం వస్తున్నాయట. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగ తండ్రి వైఎస్ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని, బెదిరించి సంపాదించిన ఆస్తులు కావన్నారు. తమ కుంటుంబం అంతా కష్టపడి నిజాయితీగా సంపాదిస్తున్నదే అని వివరించారు.

తమ ఆస్తలను కొనుగోలు చేసినప్పటి విలువలనే తాము ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తమ ఆస్తులపై ఆరోపణలు చేస్తున్నవారు కూడా తమ ఆస్తులను ప్రకటించాలన్నారు. ముందుగా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన ఆస్తులను ప్రకటించాలని సవాలు విసిరారు. ఓ పద్దతి ప్రకారం తమ ఆస్తులను ప్రకటిస్తూ, ప్రతీ ఏడు అసెంబ్లీకి కూడా అందిస్తున్నట్లు చెప్పారు. స్వచ్చంధంగా ఆస్తులను ప్రకటిస్తున్న రాజకీయ కుటుంబం దేశం మొత్తం మీదే తమదే అని చెప్పారు. తమ పార్టీలో ఎంతమంది ఆస్తులు ప్రకటిస్తున్నారో మాత్రం లోకేష్ ఎన్నడూ చెప్పలేదు.

తన తండ్రి, ముఖ్యమంత్రైన చంద్రబాబునాయుడుకు రూ. 34 లక్షల ఆస్తి ఉందన్నారు. తనకు రూ. 25.25 కోట్లు, బ్రాహ్మణి ఆస్తి రూ. 25 కోట్లు, తల్లి భువనేశ్వరి పేరుతో రూ. 25 కోట్లు, కొడుకు దేవాన్ష్ పేరుతో రూ. 11.54 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకు రూ. 3.58 కోట్ల అప్పులున్నట్లు కూడా చెప్పారు. కొత్త ఇంటని కట్టినందుకు బ్యాంకులో రుణం తీసుకున్నారట.

సరే, పనిలో పనిగా వారసత్వ వివాదం గురించి కూడా స్పందించారు. వారసత్వంగా ఫీల్డ్ లోకి రావటానికి ఎక్కువ అవకాశాలున్నా, నిలబెట్టుకోవాల్సింది మాత్ర సామర్ధ్యంతోనే కదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదన్నారు. సమస్యల ఫిర్యాదు కోసం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటరే అసలైన ప్రతిపక్షమని కూడా తెలిపారు. సమస్యల ప్రస్తావనకు వేదికైన అసెంబ్లీని ప్రతిపక్షం ఎగొట్టటాన్ని ఎద్దేవా చేశారు. పోలవరం విషయంలో తాము చెబుతున్న మాటలనే జనాలు నమ్ముతున్నారని లోకేష్ చెప్పారు.