భూమా కుంటుంబం నుండే అభ్యర్ధి అవసరంలేదని, ప్రస్తుత పరిస్ధితుల్లో టిడిపి తరపున ఎవరిని నిలబెట్టినా గెలుస్తారన్న ఆత్మస్ధైర్యాన్ని ఎంఎల్సీ ఎన్నికలు అందించాయి చంద్రబాబుకు.

త్వరలో జరుగనున్న నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి రెచ్చి పోయేందుకు మంచి అవకాశం వచ్చింది. ఈ రోజు కడప, కర్నూలు, నెల్లూరు ఎంఎల్సీ స్ధానాల్లో టిడిపి గెలవటంతో నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా పెరిగిపోయింది ఆ పార్టీలో. భూమా నాగారెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల సీటులో ఉప ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలో అర్ధంకాక అవస్తలు పడుతున్న టిడిపికి ఎంఎల్సీ ఎన్నికలు టానిక్లాగ పనిచేస్తాయనటంలో సందేహం అక్కర్లేదు. ఎన్నికలో గెలుపే అంతిమంగా చూస్తారు. ఎలా గెలిచామన్నది అనవసరం ఈ రోజుల్లో.

మూడు జిల్లాల్లోనూ టిడిపికి బలం లేకున్నా గెలిచిందంటే అధికారంలో ఉండటమే కలిసివచ్చింది. అందుకనే అందుబాటులో ఉన్న ప్రతీ మార్గాన్నీ ఉపయోగించుకున్నది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యమైనపుడు నైతికం–అనైతికమన్నదానికి చోటే లేదు. అందరూ చెబుతున్నట్లు వైసీపీకే పూర్తి మెజారిటీ ఉంది. కాబట్టి సహజంగా అయితే వైసీపీనే గెలవాలి. కానీ ఇది చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యం కాబట్టే టిడిపి అభ్యర్ధులు గెలిచారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి నిలపాలి? భూమా కుటుంబం అయితే ఎలాగుంటుందనే చర్చలు టిడిపిలో జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే, సానుభూతి ఓట్లతో గట్టెక్కుదామని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో మూడు జిల్లాల్లోనూ టిడిపినే గెలవటంతో భూమా కుంటుంబం నుండే అభ్యర్ధి అవసరంలేదని, ప్రస్తుత పరిస్ధితుల్లో టిడిపి తరపున ఎవరిని నిలబెట్టినా గెలుస్తారన్న ఆత్మస్ధైర్యాన్ని ఎంఎల్సీ ఎన్నికలు అందించాయి చంద్రబాబుకు.