నంద్యాల భయం స్పష్టంగా కనబడుతోంది

Namdyala by poll fear haunting naidu
Highlights

హఠాత్తుగా ఇంతమంది ముస్లింలకు పదవులు కట్టబెట్టటం అంటే చంద్రబాబులో భయాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. ఎందుకంటే, నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. వారి ఓట్లు రావాలంటే ముస్లింలకు తాను ఎంతో చేస్తున్నానని బిల్డప్ ఇచ్చుకోవాలి. అందులోనూ మొన్న నంద్యాలలో నిర్వహించిన ఇఫ్తార్ విందు విఫలమైంది కదా?

చంద్రబాబునాయుడులో నంద్యాల ఉపఎన్నికల భయం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ముస్లిం మైనారిటీల గురించి గడచిన మూడేళ్లుగా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు ఇపుడు వారిపై ఒక్కసారిగా అపారమైన ప్రేమ ఒలకబోస్తున్నారు. ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకునే నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు, విజయవాడలోని జలీల్ ఖాన్ కు పదవులు ప్రకటించారు.

టిడిపి పెట్టినప్పటి నుండి పనిచేస్తున్న ఎంఎ షరీఫ్ ను  ఆమధ్య ఎంఎల్సీని చేసారు. అదికూడా సంవత్సరాల పాటు నాన్చి నాన్చి షరీఫ్ వేడుకుంటేనే ఇచ్చారు. ఆ తర్వాత మైనారిటీలకు చెప్పుకోదగ్గ పదవి లేదు. హటాత్తుగా నంద్యాల సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ ను ఎంఎల్సీని చేయాలని బుద్ది పుట్టింది. అదేవిధంగా ఇటీవలే టిడిపిలో చేరిన నంద్యాల మాజీ ఛైర్మన్ నౌమన్ ను ఉర్దూ అకాడమీ ఛైర్మన్ చేసారు. వైసీపీ నుండి ఫిరాయించిన ఎంఎల్ఏ జలీల్ ఖాన్ కు కూడా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారు. అదే విధంగా, కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి (కుడా) ఛైర్మన్ గా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లును ఎంపిక చేసారు.

ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఫరూఖ్ అయినా సోమిశెట్టిని అయినా చంద్రబాబు సంవత్సరాల పాటు దూరంగా పెట్టేసారు. వీరిద్దరూ నిజానికి బాగా సీనియర్లే అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. నంద్యాల ఉపఎన్నికల పుణ్యమా అని వీరిద్దరికి పదవీ యోగం పట్టింది. అదే విధంగా జలీల్ ఖాన్ అయినా కాంగ్రెస్ నుండి ఇటీవలే టిడిపిలో చేరిన నౌమన్ కు కూడా పదవులు అందుకోవటానికి ఉపఎన్నికే కారణం. లేకపోతే వీరెవరినీ చంద్రబాబు పట్టించుకునే అవకాశాలే లేవు.

మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మైనారిటీ కూడా లేరన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలు ఈ విషయంలో ఎన్ని ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు లెక్క చేయటంలేదు. అటువంటిది హఠాత్తుగా ఇంతమంది ముస్లింలకు పదవులు కట్టబెట్టటం అంటే చంద్రబాబులో భయాన్ని స్పష్టంగా బయటపెడుతోంది. ఎందుకంటే, నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. వారి ఓట్లు రావాలంటే ముస్లింలకు తాను ఎంతో చేస్తున్నానని బిల్డప్ ఇచ్చుకోవాలి. అందులోనూ మొన్న నంద్యాలలో నిర్వహించిన ఇఫ్తార్ విందు విఫలమైంది కదా?

 

 

loader