దారుణంగా ఫెయిలైన చంద్రబాబు వ్యూహం

First Published 5, Dec 2017, 10:54 AM IST
Naidus plan reverted over implementation of reservations for kapus
Highlights
  • కాపులను  బిసి రిజర్వేషన్లో కలపటం చెల్లదని తెలిసీ హామీ ఇచ్చారు

చంద్రబాబునాయుడు వ్యూహం దారుణంగా ఫైల్ అయ్యింది. అదికూడా రోజుల వ్యవధిలోనే సీన్ ఇంత రివర్స్ అవుతుందని చంద్రబాబు అనుకుని ఉండరు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నది రాజకీయ నిర్ణయం. రిజర్వేషన్ కల్పించటానికి సరైన ఆధారాల్లేవు. పోయిన ఎన్నికల సందర్భంగా కాపుల ఓట్లకు గాలం వేసేందుకు వారిని బిసిల్లోకి చేరుస్తానంటూ హామీ ఇచ్చిన సంగతి అందరకీ తెలిసిందే. తన హామీ అమలు సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు డ్రామా ఆడారు.

కాపుల ఆందోళనకు భయపడే చంద్రబాబు జస్టిస్ మంజూనాధ కమీషన్ నియమించారు. నాలుగురోజుల క్రితం కమీషన్లోని ముగ్గురు సభ్యులతో ఓ నివేదికను తెప్పించుకోవటం దాన్ని హడావుడిగా మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపచేసుకున్నారు. మరుసటి రోజే అసెంబ్లీలో కూడా పెట్టి ఓ తీర్మానం పాస్ చేయించి అమలు చేయాలంటూ కేంద్రానికి పంపేసారు.

ఇక్కడే బిసి సామాజికవర్గాలకు ఒళ్ళుమండింది. నివేదికను బిసి మంత్రులతో కానీ ఎంఎల్ఏలతో కానీ చంద్రబాబు మాట్లాడలేదు. కమీషన్లోని సభ్యులిచ్చిన నివేదికను వెబ్ సైట్లో పెట్టటం, ప్రజాభిప్రాయం సేకరించటం లాంటి ప్రొసీజర్ నూ పక్కన పడేశారు. కాపులను బసిల్లోకి చేర్చటాన్ని బిసి సామాజికవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగానే, కాపులకు  బిసి రిజర్వేషన్ కల్పించటం వల్ల  బిసిలకు ఎటువంటి నష్టం లేదంటూ బిసి మంత్రులతోనే అసెంబ్లీలో మాట్లాడించారు.

వెంటనే కొరియాకు బయలుదేరిన సిఎం ముందుగా ఢిల్లీలోని నరేంద్రమోడి, కేంద్రమంత్రులతో చర్చించి తీర్మానికి ఆమోదముద్ర వేయించుకోవాలని అనుకున్నారు. అందుకు పోలవరం ప్రాజెక్టు ముసుగు కప్పారు. చంద్రబాబు వ్యూహాన్ని పసిగట్టిన కేంద్రంలోని పెద్దలు అంతే వేగంగా స్పందించారు. ప్రధానితో సహా కేంద్రమంత్రులు చంద్రబాబుకు ఎవరూ అపాయిట్మెంట్ ఇవ్వలేదు. దాంతో ఎవరినీ కలవకుండానే సిఎం కొరియాకు వెళ్ళిపోయారు.

గుజరాత్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రధాని మాట్లాడుతూ, 50 శాతానికన్న ఎవరైనా రిజర్వేషన్ కల్పిస్తామని చెబితే అవన్నీ తప్పుడు హామీలే అంటూ తేల్చేసారు. 50 శాతం రిజర్వేషన్లు దాటిన ప్రతిపాదనలను ఆమోదించే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని స్పష్టంచేసారు. దాంతో చంద్రబాబు వ్యూహం దారుణంగా దెబ్బతినేసింది. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపైకి నెట్టేయటం ద్వారా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందుదామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టంది. రిజర్వేషన్ల అంశంలో కేంద్రాన్ని దోషిగా నిలబెడదామన్న తన వ్యూహం మరీ మూడు రోజుల్లోనే రివర్స్ అవుతుందని చంద్రబాబు ఊహించి ఉండరేమో. విదేశాలనుండి తిరిగి వచ్చిన తర్వాత  ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కుతారో చూడాలి?  

 

loader