భాజపాపై రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుందన్న సత్యాన్ని చంద్రబాబు గ్రహించారు. అందుకే మహానాడు సాక్షిగా బాహాటంగానే భాజపా పై ఎవరూ విమర్శలు వద్దని కట్టడిచేసారు. ఒకవేళ భాజపా నేతలు విమర్శించినా టిడిపి నేతలు మాత్రం మాట్లాడవద్దని చెప్పారంటేనే చంద్రబాబు పరిస్ధితి ఏంటో అర్ధమవుతోంది.
నరేంద్రమోడి-జగన్ భేటీ ప్రభావం చంద్రబాబును ఇంకా వెన్నాడుతున్నట్లే ఉంది. మహానాడు చివరిరోజైన సోమవారం చంద్రబాబు మాట్లాడుతూ ‘చీటికిమాటికీ మిత్రపక్షంతో గొడవలు పెట్టుకోవద్దు’ అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా భాజపా నేతలు ఎంత విమర్శించినా మనం మాత్రం ఏమీ మాట్లాడవద్దని స్పష్టంగా నేతలందరికీ చెప్పా’నని తెలిపారు. అదే విధంగా పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని, ఎన్నికల సమయంలో ఏం చేయాలో అది చేస్తానంటూ చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.
చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్రమోడి భేటీ అయ్యారు. దాని తర్వాత ఇరు పార్టీల నేతల మధ్య జరిగిన మాటల యుద్ధం అన్నీ అందరికీ తెలిసిందే. మంత్రులు, నేతలు ప్రధానిపై చేసిన విమర్శలను జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు మోడికి స్ధానిక నేతలు చేరవేసారు.
అప్పటి నుండి ఇరుపార్టీల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణించాయి. ఇటీవలే అమిత్ షా పర్యటనలో ఆ విషయం స్పష్టంగా కనబడింది. ఆ విషయాన్ని చంద్రబాబు బాగా గుర్తుంచుకున్నట్లే కనబడుతోంది. భాజపాపై రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుందన్న సత్యాన్ని చంద్రబాబు గ్రహించారు. అందుకే మహానాడు సాక్షిగా బాహాటంగానే భాజపా పై ఎవరూ విమర్శలు వద్దని కట్టడిచేసారు. ఒకవేళ భాజపా నేతలు విమర్శించినా టిడిపి నేతలు మాత్రం మాట్లాడవద్దని చెప్పారంటేనే చంద్రబాబు పరిస్ధితి ఏంటో అర్ధమవుతోంది.
పైగా ఏపిని కేంద్రం ప్రత్యేకరాష్ట్రంగా పరిగణిస్తోందని ప్రధాని హామీ ఇచ్చారంటూ చెప్పారు. ప్రత్యేకరాష్ట్రంగా పరిగణించటమంటే ఏమిటో వారిద్దరికే తెలియాలి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా లేదు. పోనీ మోడి సర్కార్ చెప్పిన ప్రత్యేకప్యాకేజికి చట్టబద్దత కల్పించారా అంటే అదీ లేదు.
రెవిన్యూలోటునూ భర్తీ చేయలేదు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వే జోన్ కూడా మంజూరు చేయలేదు. విభజన చట్టంలో పేర్కొన్నవాటిల్లో వేటిని మోడి ప్రభుత్వం ఇవ్వకపోయినా చంద్రబాబు అడిగే స్ధితిలో లేరు. కేంద్రం ఏపిని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తున్నట్లు మోడి చెప్పారని చంద్రబాబు చెబితే నమ్మేదెవరు?
