లోకేష్ తో పాటు జలీల్ ఖాన్, తాజాగా ఎస్వీ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా నోటికొచ్చింది మాట్లాడుతూ జనాల ముందు పలుచనైపోతున్నారు. వారి వ్యక్తిగతం ఎలాగున్నా పార్టీ పరువు మాత్రం పోతోందన్నది వాస్తవం.
‘పార్టీలో కొందరు నేతలు నోరు జారుతున్నారు జాగ్రత్త’ అంటూ చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకున్నారు. ఈరోజు టిడిపి సమన్వయ కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలంటూ నేతలకు గట్టిగా హెచ్చరించటంపై పార్టీలో పెద్ద చర్చ మొదలైంది.
ఎందుకంటే, నోరు జారటం అనే విషయంలో అందరికన్నా ఎక్కువ చర్చల్లో ఉన్న వ్యక్తి నారా లోకేషే. నోరు జారి ఇప్పటికే ఎన్నోసార్లు అభాసుపాలయ్యారు. ఏం చెప్పదలుచుకున్నారో..ఏం చెబుతున్నారో అర్ధం కాకుండా లోకేష్ పెద్ద కామెడీ పీస్ అయిపోయారు.
లోకేష్ తో పాటు జలీల్ ఖాన్, తాజాగా ఎస్వీ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా నోటికొచ్చింది మాట్లాడుతూ జనాల ముందు పలుచనైపోతున్నారు. వారి వ్యక్తిగతం ఎలాగున్నా పార్టీ పరువు మాత్రం పోతోందన్నది వాస్తవం. అదే విషయమై చంద్రబాబు ఇపుడు తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా వాటిని ప్రజలకు వివరించి చెప్పటంలో నాయకులు విఫలమవుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.
చివరగా మంగళగిరిలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆదేశించారు. జన్మభూమి కమిటీల పనితీరు బావోలేదనే భావన కూడా జనాల్లో వ్యక్తమవుతోందని అసంతృప్తి వ్యక్తం చేసారు. త్రాగునీటి విషయంలో కూడా ప్రజల్లో అసంతృప్తి ఉందని ఇది పెరగకుండా జాగ్రత్త పడాలని నేతలకు సూచించినట్లు సమాచారం.
