2036కి హ్యాపియెస్ట్ సిటీల్లో అమరావతి ఒకటట ! (వీడియో)

2036కి హ్యాపియెస్ట్ సిటీల్లో అమరావతి ఒకటట ! (వీడియో)

‘ఆలు లేదు చూలు లేదు అల్లుడిపేరు సోమలింగ’మట. అలాగే ఉంది చంద్రబాబునాయుడు వ్యవహారం. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లానే సిద్ధం కాలేదు. ప్లాన్లు ఎప్పుడు సిద్ధమవుతాయో తెలీదు ? నిర్మాణాలకు టెండర్లను ప్రభుత్వం ఎప్పుడు ఆహ్వానిస్తుందో ఏమో? స్విస్ ఛాలెంజ్ వ్యవహారాలపై కోర్టులో కేసులు ఎప్పుడు పరిష్కారమవుతాయో తెలీదు? ఏమున్నాలేకపోయినా 2036కి అమరావతిని  హ్యాపియెస్ట్ సిటిల్లో ఒకటిగా చేయాలట.

రాజధాని ప్లాన్లు సిద్ధమయ్యేనాటికి, నిర్మాణాలు మొదలయ్యే సమయానికి 2019 ఎన్నికలు ముంచుకొచ్చేస్తాయి. ఎన్నికల తర్వాత అధికారంలో ఎవరుంటారో ఇపుడే చెప్పలేం. అటువంటిది 2036 అంటే ఊహించటమే అనవసరం. మరెందుకు చంద్రబాబు ఇవన్నీ మాట్లాడుతున్నారు ? అంటే, ఆయనంతే. భ్రమల్లో బ్రతకటానికి అలవాటు పడిపోయారు. చేయటానికి ఏమీ లేదు కాబట్టి జనాలను భ్రమల్లో ముంచెత్తే ప్రయత్నంలో తాను కూడా భ్రమల్లో కూరుకుపోతున్నట్లు కనబడుతోంది.

అసలింతకీ అమరావతి నగరం ఎక్కడుంది అని సందేహిస్తున్నారా ? అదంతే, ఎవరికీ సందేహాలు రాకూడదు. బ్రిటన్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ రాజధాని మాస్టర్ ప్లాన్లు ఇచ్చేశారు. అత్యుత్తమ ప్రపంచ ప్రమాణాలతో అద్భుత అమరావతి నగరాన్ని చంద్రబాబు నిర్మించేశారు. జనాలందరూ అందులో హ్యాపీ. కాబట్టి 2036కి ప్రపంచంలోని హ్యాపియెస్ట్ సిటీస్ జాబితాలో అమరావతి నగరం చోటు చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.

ఇదంతా చదువుతుంటే ఏదోలా ఉందా? చంద్రబాబు పాలన కదా అలానే ఉంటుంది. అధికారంలోకి వచ్చేటప్పటికే నిర్మాణంలో ఉన్న  పోలవరం ప్రాజెక్టు పనులనే చంద్రబాబు వేగవంతం చేయలేకపోయారు. ఇక, రాజధాని నిర్మాణం గురించి ఆలోచించటం కూడా దండగే. అటువంటిది అమరావతిని 2036కి హ్యాపియెస్ట్ సిటీస్ లో ఒకటిగా నిలబెడతానని చెబితే ఎవరైనా నమ్ముతారా? ఎదుటి వాళ్ళ నమ్మకంతో చంద్రబాబుకు పనిలేదు కదా?

అమరావతిలో ఆర్దికాభివృద్ధి, నాణ్యమైన జీవన ప్రమాణాలు, ఆకర్షణీయ, సుస్ధిర మౌళిక వసతుల కల్పన, సుపరిపాలన అన్న నాలుగు లక్ష్యాలను చేరుకోవటానికి అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈనెల 14, 15 తేదీల్లో సదస్సు జరుగుతోంది. అందుకు ప్రపంచదేశాల నుండి నిపుణులు కూడా వస్తున్నారు. 2035 నాటికి తలసరి ఆదాయంలో ప్రపంచంలోని 20 అగ్రశ్రేణి నగరాల్లో ఒకటి చేయాలన్నది చంద్రబాబు లక్ష్యమట.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos