Asianet News TeluguAsianet News Telugu

సెంటిమెంటుతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు

  • వైఎస్ మరణించినపుడు పులివెందుల్లో, శోభా నాగిరెడ్డి మరణించినపుడు ఆళ్లగడ్డలో టిడిపి పోటీలేదన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
  • కానీ చంద్రబాబు ఒక విషయం మరచిపోయారేమో.
  • వైఎస్ అయినా శోభానాగిరెడ్డి అయినా గెలిచింది, మరణించేనాటికి ఉన్నది కాంగ్రెస్, వైసీపీల్లోనే.
  • సాంకేతికంగా నంద్యాల సీటు వైసీపీదే అన్న విషయం అందరికీ తెలిసిందే.
  • చంద్రబాబు నిజంగా సంప్రదాయాలు, నైతికకు విలువిచ్చే వారైతే పోటీలో నుండి తప్పుకోవాల్సింది టిడిపినే.
  • ఎవరికైనా అనుమానాలుంటే ఎన్నికల కమీషన్, అసెంబ్లీ వెబ్ సైట్లు చూస్తే భూమా ఏ పార్టీ తరపున గెలిచారో స్పష్టంగా కనబడుతుంది.
Naidu using sentiment in nandyala by poll

చంద్రబాబాబునాయుడు ఎందుకిలా మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు. నంద్యాల ఉపఎన్నికలో పోటీ అనివార్యమైన తర్వాత పోటీ గురించే మాట్లాడాలి కానీ, గెలుపోటముల గురించే ఆలోచించాలి కానీ సెంటిమెంటును ఎందుకు ప్రయోగిస్తున్నారు? బహుశా గెలుపుపై అనుమానం వచ్చిందేమో? అందుకనే జనాలను సెంటిమెంటు అస్త్రంతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనబడుతోంది.

ఆదివారం నంద్యాలలో స్ధానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారితో మాట్లాడుతూ, రాజకీయ సంప్రదాయాలు, నైతికతకు టిడిపి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గడచిన మూడేళ్ళ చంద్రబాబు రాజకీయం చూస్తుంటే నైతికతను ఎంతబాగా ఆచరిస్తున్నారో ఎవరికైనా అర్ధమైపోతుంది. ఏడాదిన్న పదవి కోసం తల్లి, దండ్రులను కోల్పోయిన బిడ్డలపై పోటీ పెడుతున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జనాలను రెచ్చ గొడుతున్నారు.

వైఎస్ మరణించినపుడు పులివెందుల్లో, శోభా నాగిరెడ్డి మరణించినపుడు ఆళ్లగడ్డలో టిడిపి పోటీలేదన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కానీ చంద్రబాబు ఒక విషయం మరచిపోయారేమో. వైఎస్ అయినా శోభానాగిరెడ్డి అయినా గెలిచింది, మరణించేనాటికి ఉన్నది కాంగ్రెస్, వైసీపీల్లోనే. కానీ నంద్యాల వ్యవహారం వేరు. వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డిని చంద్రబాబు బలవంతంగా టిడిపిలోకి ఫిరాయించేట్లు చేసారు. పైగా చంద్రబాబు ఓ విషయం మరచిపోయారు. టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి దివంగత ఎంఎల్ఏ నాగిరెడ్డి కొడుకు కాదు. నాగిరెడ్డి సోదరుని కుమారుడు.

అంటే, సాంకేతికంగా నంద్యాల సీటు వైసీపీదే అన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నిజంగా సంప్రదాయాలు, నైతికకు విలువిచ్చే వారైతే పోటీలో నుండి తప్పుకోవాల్సింది టిడిపినే. ఎవరికైనా అనుమానాలుంటే ఎన్నికల కమీషన్, అసెంబ్లీ వెబ్ సైట్లు చూస్తే భూమా ఏ పార్టీ తరపున గెలిచారో స్పష్టంగా కనబడుతుంది. ఇవిషయాలేవీ చంద్రబాబుకు తెలీనివి కావు. మూడేళ్ళ పాలనపై నంద్యాల గెలుపోటములు ఒక రెఫరెండంగా చంద్రబాబు భావిస్తున్నారు.

ఇక్కడ ఓడిపోతే టిడిపితో పాటు మిగిలిన ఫిరాయింపు ఎంఎల్ఏల్లో కూడా రేపటి ఎన్నికల్లో గెలుపుపై అనుమానాలు మొదలవుతాయన్న భయం చంద్రబాబును వెన్నాడుతోందేమో? ఒకవైపు ఓటమి భయం, ఇంకోవైపు కలసిరాని పరిస్థితులు. ఆ అక్కసంతా  చంద్రబాబు మాటల్లో స్పష్టంగా కనబడుతోంది.