చంద్రబాబునాయుడు మళ్ళీ ఢిల్లీకి వెళుతున్నారు. మూడున్నరేళ్ళుగా ఢిల్లీకి వెళుతున్నారు, వస్తన్నారు. కానీ నిర్దిష్టంగా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి  సాధించుకు వచ్చింది ఇది అని చెప్పుకోలేని పరిస్దితి చంద్రబాబుది. ఆమధ్య స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు తాను 64 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చినట్లు. ప్రధానమంత్రి అపాయిట్మెంట్ దొరకటమే గగనమైపోతోంది సిఎంకు. ఏడాదిన్నర తర్వాత దొరికిన అపాయిట్మెంట్ కూడా పెద్దగా సానుకూలంగా ఉన్నట్లు కనిపించటం లేదు. లేకపోతే ఈపాటికి ‘పచ్చ మీడియా’ అదిరిపోయేట్లు ఊదరగొట్టేదే చంద్రబాబు-ప్రధాని భేటి విశేషాలను.

సరే, ఇక ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు బుధవారం అంటే రేపే మళ్ళీ ఢిల్లీ వెళుతున్నారు. ‘సిఐఐ భాగస్వమ్య సదస్సు-2018’లో పాల్గొనేందుకు వెళుతున్నారు. పనిలో పనిగా కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, రాజ్ నాధ్ సింగ్ తో కూడా సమావేశమవుతారట. ఎందుకయ్యా అంటే రాష్ట్రానికి రావల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, నియోజకవర్గాల సంఖ్య పెంచటం తదితర అంశాలపై చర్చిస్తారట. అవకాశం ఉంటే ప్రధానమంత్రి నరేంద్రమోడితో కూడా భేటీ ఉంటుందని సమాచారం.

చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ఉపయోగం ఏమీ ఉండటం లేదు. అందుకు కారణం చంద్రబాబు విషయంలో ప్రధాని సానుకూలంగా లేకపోవటమే. వాళ్ళిద్దరికీ ఎక్కడ చెడిందో స్పష్టంగా తెలియకపోయినా చంద్రబాబు మీద కోపంతోనే కేంద్రం ఏపికి అన్యాయం చేస్తోందన్నది మాత్రం వాస్తవం. మరి ఇంత చిన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించలేరా? ఎందుకు గ్రహించలేరు? కాకపోతే ఏమీ చేయలేని పరిస్దితి అంతే. చూద్దాం, ఈసారి ఢిల్లీ పర్యటనలో అయినా రాష్ట్రానికి ఏమైనా సాధించుకువస్తే మంచిదే కదా?