గత ఏడాది అక్టోబర్ 23 ప్రధాని అమరావతి శంకుస్థాపన ఇపుడు సెప్టెంబర్ 30 రాజధాని పరిపాలనా నగరానికి శంకుస్థాపన ఇంతకు ముందొకసారి తాత్కాలిక రాజధానికి శంకుస్థాపన జరిగింది

రాజధాని అమరావతికి ఇది ఎన్నో శంకుస్థాపనో చెప్పడం కష్టం. అపోజిషనోళ్లు ఏడోసారంటున్నారు. ఒక సారి రాజధానికి, మరొక సారి తాత్కాలిక రాజధానికి,మరొక సారి పరిపాలనా నగరానికి... ఇలా శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. 2014 లో తెలుగుదేశం ప్రభత్వం వచ్చాక ప్రతిదీ పండగే అయింది.

ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా నగర నిర్మాణానికి పునాది రాయి వేయబోతున్నారు. దసరా పండుగ మంచి ముహూర్తం అని నిర్ణయించారు. సెప్టెంబర్ 30న ఉదయం 8.26కి అసెంబ్లీతో పాటు , రాజధానిలో మంత్రులు, అధికారుల గృహాల నిర్మాణ ప్రాజెక్టులకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. సరిగ్గా ఏడాది కిందట అక్టోబర్ 23వ తేదీన ప్రధాని మోదీ అమరావతికి శంకస్థాపనం చేశారు. ఈ కార్యక్రమం మీద పెట్టిన ఖర్చు చాలా వివాదానికి దారితీసింది.

తర్వాత 2016 ఫిబ్రవరిలో వెలగపూడిలో తాత్కాలిక రాజధానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

ఇపుడు రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్ రాజధానికి శంకుస్థాపన చేస్తున్నారు.

ఇక్కడి అసెంబ్లీ నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం టెండరు ప్రకటన జారీ చేసింది. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. శాసనసభ భవన ఆకృతి స్థూలంగా ఖరారైంది. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ కోహినూర్‌ వజ్రాన్ని పోలిన విధంగా ఆకృతి రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం విజయవాడకు వస్తున్నారు. ఈ నెల 13న ముఖ్యమంత్రితో సమావేశమయి హైకోర్టు భవన ఏ ఆకారంలో ఉంటుందో ఖరారు చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు కూడా డిజైన్ల గురించి వివరిస్తారు. హైకోర్టు ఆకృతి స్థూపాకారంలో ఉంటుంది.సెక్రెటేరియట్, విభాగాధిపతుల కార్యాలయ (హెచ్‌ఓడీ) భవనాల డిజైన్లను కూడా అదే రోజు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ అందజేస్తుందని సిఆర్ డి ఎ అధికారులు తెలిపారు.
శాసనసభ భవనం ఎత్తు 42 మీటర్లు వైశాల్యం 11లక్షల చదరపు అడుగుతలు. మొత్తం శాసనసభ భవనం కోహినూర్‌ ఆకృతిలా కనిపించేలా, భవనం మధ్య ప్రాంతం (సెంట్రల్‌ ఏట్రియం) వజ్రం ఆకృతిలో ఉండేలా నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రెండు భిన్నమైన ఆకృతుల్ని అందిస్తే, వజ్రాకారాన్ని ఖరారు చేస్తారు. ఇది నాలుగు అంతస్తుల భవనం. మొదటి అంతస్తులో ఐదు ప్రధాన భాగాలుంటాయి. ఒక దానిలో శాసనసభ, మరో దానిలో శాసన మండలి, మూడో దానిలో సెంట్రల్‌ హాల్‌, నాలుగో అరలో కార్యాలయాలు, ఇతర సదుపాయాలు వంటివి ఉంటాయి. ఈ నెలాఖరుకి టెండర్లు పిలుస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. హైకోర్టు భవనం 18-19 లక్షల చ.అడుగుల్లో ఉంటుంది.

సచివాలయం, హెచ్‌ఓడీ భవనాలను ఐదు వేల మంది ఉద్యోగులు ఉండేలా రూపొందిస్తున్నారు. గూగుల్‌ కార్యాలయం కంటే ఇది బాగుండాలని భావిస్తున్నారు.

ఇపుడు పునాది వేస్తున్న హౌసింగ్ ప్రాజక్టులో ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇళ్లుంటారు. తొలిదశలో సుమారు 4 వేల ఫ్లాట్లు నిర్మిస్తారు.